హైదరాబాద్ కొండాపూర్‌లోని రాజరాజేశ్వరి కాలనీలో ఆరు ఎకరాల ప్రభుత్వ భూమిని పార్క్, విద్యా సంస్థల స్థాపనకే వినియోగిస్తామని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జీ సృజన స్పష్టం చేశారు. విద్యా సంస్థలు, పార్క్ ల అభివృద్ధికి కేటాయించిన భూమి ఆక్రమణకు గురైనట్లు ఫిర్యాదులు రావడంతో సీఎంసీ కమిషనర్ సృజన, విద్యాశాఖ కమిషనర్ నవీన్ నికోలస్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ కలిసి పరిశీలించారు.
ఆమోదిత లేఅవుట్ ప్రకారం 5 ఎకరాలు విద్యా సంస్థలకు, ఒక ఎకరం పార్క్ అభివృద్ధికి కేటాయించారు. అయితే లేఅవుట్, రెవెన్యూ రికార్డులతో సరిపోల్చి పరిశీలించగా కొంతభాగం ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. అధికారుల ద్వారా భూమికి స్పష్టమైన డీమార్కేషన్ చేశారు. భవిష్యత్తులో ఆక్రమణలు జరగకుండా సంబంధిత శాఖలతో ఫెన్సింగ్ పనుల ప్రారంభించారు. ఆరు ఎకరాల భూమిని ప్రజాప్రయోజనాలకే వినియోగిస్తామని స్థానికులకు అధికారులు భరోసా ఇచ్చారు. ఐదు ఎకరాల్లో విద్యాసంస్థల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని విద్యాశాఖ కమిషనర్‌కు సీఎంసీ కమిషనర్ సూచించారు. ఒక ఎకరా పార్క్ స్థలాన్ని వెంటనే అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం సమీప మార్కెట్ ప్రాంతాల్లో సీఎంసీ కమిషనర్ సృజన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రతి వ్యాపారి తన దుకాణం వద్ద డస్ట్‌బిన్ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. రోడ్లపై చెత్త వేయరాదని హెచ్చరించారు. చెత్త సేకరణ సమయంలో SAT వాహనాలకు అప్పగించాలని సూచించారు. పారిశుద్ధ్య సిబ్బంది నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. రోడ్లపై చెత్త పేరుకుపోకుండా నిరంతర పర్యవేక్షించాలని ఆదేశించారు.
