T20 World Cup: బ్యాటింగ్, బౌలింగ్‎లో అట్టర్ ఫ్లాప్.. సౌతాఫ్రికా చేతిలో భారత్ ఘోర ఓటమి

T20 World Cup: బ్యాటింగ్, బౌలింగ్‎లో అట్టర్ ఫ్లాప్.. సౌతాఫ్రికా చేతిలో భారత్ ఘోర ఓటమి

గాంధీ నగర్: టీ20 వరల్డ్ కప్‎లో సౌతాఫ్రికా జైత్రయాత్ర కొనసాగుతోంది. గ్రూప్ దశను అజేయంగా ముగించిన సఫారీలు.. సూపర్ 8 రౌండ్‎ను గెలుపుతో ఆరంభించారు. సూపర్ 8‎ దశలో భాగంగా ఆదివారం (ఫిబ్రవరి 22) అహ్మదాబాద్‎లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచులో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. 

బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించి ఇండియాను 76 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన సఫారీలు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేశారు. మిల్లర్ (63) హాఫ్ సెంచరీతో రాణించగా.. స్టబ్స్ (44), బ్రెవిస్ (45) ఆకట్టుకున్నారు.

188 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన భారత్ 18.5 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌట్ అయ్యింది. టీమిండియాలో దూబే (42) మినహా అందరూ విఫలమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కొ యాన్సెన్స్ (4),  కేశవ్ మహారాజ్ (3) ఇండియాను కోలుకోలేని దెబ్బకొట్టారు. కార్బిన్ బాష్ రెండు వికెట్లు తీయగా.. మార్క్రమ్ ఒక వికెట్ పడగొట్టాడు. 

మిల్లర్, స్టబ్స్ మెరుపులు:

ఈ మ్యాచులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‎కు దిగిన సౌతాఫ్రికాకు భారత బౌలర్ల బుమ్రా, అర్షదీప్ ఆదిలోనే బిగ్ షాక్ ఇచ్చారు. ఇన్సింగ్స్ సెకండ్ ఓవర్ చేసిన బుమ్రా ఒక ఫోర్ కొట్టి దూకుడు మీదున్న ఓపెనర్ డికాక్‎ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లోనే కెప్టెన్ మార్క్రమ్ అర్షదీప్ బౌలింగ్‎లో దూబేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. మార్క్రమ్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రికెల్టన్ అర్షదీప్ బౌలింగ్‎లో భారీ సిక్స్ కొట్టి మంచి టచ్‎లో కనిపించాడు.

 కానీ ఆ తర్వాత ఓవర్లనే రికెల్టన్ బుమ్రా బౌలింగ్‎లో క్యాచ్ ఔటై నిరాశగా వెనుదిరిగాడు. 5 ఓవర్లలోనే కెప్టెన్ మార్క్రమ్, డికాక్, రికెల్టన్ మూడు కీలక వికెట్లు పడగొట్టి ప్రొటిస్‎ను ఒత్తిడిలోకి నెట్టారు. ఈ దశలో జతకట్టిన బ్రేవిస్ (45), మిల్లర్ (63) ఇండియా బౌలర్లను ఆటాడుకున్నారు. ముఖ్యంగా డేవిడ్ మిల్లర్ చెలరేగి ఆడి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకుని ఫోర్లు, సిక్సుల వర్షం కురిపించారు. 

దీంతో 13 ఓవర్లు ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 128/4తో పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ దశలో శివమ్ దూబే ఇండియాకు బ్రేక్ ఇచ్చాడు. హాఫ్ సెంచరీ దిశగా సాగుతోన్న బ్రేవిస్ (45)ను అవుట్ చేశాడు. దీంతో స్టబ్స్, మిల్లర్ ఇన్నింగ్స్‎ను ముందుకు నడిపించారు. అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని మరింత ప్రమాదకరంగా మారుతోన్న మిల్లర్‎ను వరుణ్​ చక్రవర్తి ఔట్ చేశాడు. చివర్లో స్టబ్స్ (44) మూడు సిక్సులు, ఒక ఫోర్‎తో మెరుపులు మెరిపించి సౌతాఫ్రికాకు భారీ స్కోర్ అందించాడు. 

ఇషాన్ డకౌట్.. అభిషేక్ మళ్లీ ఫ్లాఫ్:

188 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు మొదట్లోనే కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలింది. ఈ మెగా టోర్నీలో భీకర ఫామ్‎లో ఉన్న ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్లలోనే డకౌట్ అయ్యాడు. మార్క్రమ్ బౌలింగ్‎లో క్యాచ్ ఔటై తీవ్ర నిరాశతో పెవిలియన్ బాటపట్టాడు. ఈ షాక్ నుంచి తేరుకోకముందే రెండో ఓవర్లో ఇండియాకు మార్కో యాన్సెన్ మరో ఝలక్ ఇచ్చాడు. 

తెలుగు క్రికెటర్ తిలక్ వర్మను (1) ఔట్ చేశాడు. గత మూడు మ్యాచుల్లో డకౌటైన అభిషేక్ (15) ఒక ఫోర్, సిక్స్ కొట్టి టచ్‎లోకి వచ్చినట్లు అనిపించినా ఆ వెంటనే యాన్సెన్ బౌలింగ్‎లో భారీ షాట్‎కు ప్రయత్నించి క్యాచ్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్ కూడా (11) విఫలమయ్యాడు. 

కాసేపు పోరాడిన కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (18) వైడ్ వెళ్తున్న బంతిని వెంటాడి వికెట్ సమర్పించుకున్నాడు. స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా (18) ఒక సిక్స్ కొట్టి అలరించిన ఎక్కువ సేపు క్రీజులో నిలువలేదు. ఒకవైపు వికెట్లు పడుతున్నా శివమ్ దూబే (42) ఒంటరి పోరాటం చేశాడు. వేగంగా ఆడే క్రమంలో యాన్సెన్ బౌలింగ్‎లో క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో ఇండియా ఓటమి ఖరారైంది.