తిరుపతి: కల్తీ నెయ్యి వ్యవహారంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండు నాటకాలు ఆడుతున్నాయని సీపీఐ జాతీయ నేత కె.నారాయణ విమర్శించారు. దీనిపై సీబీఐ, సిట్ విచారణ జరిపి నివేదికలు సమర్పించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిందితులపై చర్యలు తీసుకోకుండా ఏకసభ్య కమిషన్ను నియమించడం ఏంటని ప్రశ్నించారు.
రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం వేంకటేశ్వర స్వామిని వాడుకుంటూ, భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆరో పించారు. విచారణల పేరుతో కాలయాపన చేస్తూ, నిందితులను తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. తప్పు జరిగిన విషయం అందరికీ తెలిసిందేనని.. ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకోకుండా భక్తుల మనోభావాలను గౌరవించాలని సూచించారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేటట్లు చేయాలని డిమాండ్ చేశారు.
