మన దేశంలో గుండె జబ్బులు మరణాలకు ముఖ్య కారణం అవుతున్నాయి. మరీ ముఖ్యంగా రక్త పరీక్షలో కొలెస్ట్రాల్ లెవెల్స్ సాధారణంగా ఉన్న కూడా యువకులు సైతం గుండెపోటుకు గురవుతున్నారు. ఇందుకు కారణాలను వైద్య నిపుణులు వివరిస్తు ఏమంటున్నారంటే.....
1. భారతీయుల కొలెస్ట్రాల్: సాధారణంగా కొలెస్ట్రాల్ ఉన్నట్లు అనిపించినా, చాలా మంది భారతీయులలో HDL (మంచి కొలెస్ట్రాల్) తక్కువగా, ట్రైగ్లిజరైడ్స్ (చెడు కొవ్వు) ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రక్త నాళాల్లో పూడికలు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది.
2. కొలెస్ట్రాల్ కంటే నాణ్యత ముఖ్యం: సాధారణ టెస్టులు కొలెస్ట్రాల్ ఎంత ఉందో మాత్రమే చెబుతాయి. కానీ భారతీయులలో స్మాల్ డెన్స్ LDL అనే చిన్న కణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి చాలా ప్రమాదకరమైనవి. ఇవి రక్త నాళాలల్లోకి సులభంగా వెళ్లి రక్తం గడ్డకట్టేలా చేస్తాయి.
3. ఇన్సులిన్ నిరోధకత: భారతీయులలో పొట్ట దగ్గర కొవ్వు, ప్రీ-డయాబెటిస్ వంటి సమస్యలు ఎక్కువ. ఇన్సులిన్ నిరోధకత వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ పెరగకపోయినా, రక్త నాళాలు గట్టిపడి గుండెకు రక్తప్రసరణ తగ్గుతుంది.
4. జన్యుపరమైన ప్రమాదం: చాలా మంది భారతీయుల్లో జన్యుపరంగానే లిపోప్రొటీన్(a) ఎక్కువగా ఉంటోంది. ఇది మామూలు లిపిడ్ ప్రొఫైల్ టెస్టులో బయటపడదు. దీనివల్ల ఇతర కొలెస్ట్రాల్ లెవల్స్ నార్మల్‌గా ఉన్నా సరే.. గుండెపోటు ఇంకా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది.
5. చిన్న వయసులోనే గుండె జబ్బులు: కొన్ని దేశాలతో పోలిస్తే భారతీయులకు 10 ఏళ్ల ముందే గుండె సమస్యలు మొదలవుతున్నాయి. 20-30 ఏళ్ల వయసు నుంచే నాళాల్లో పూడికలు (Plaque) ఏర్పడటం ప్రారంభమవుతోంది. దీనికి తోడు మానసిక ఒత్తిడి, నిద్రలేకపోవడం, సరైన వ్యాయామం లేకపోవడం ప్రమాదాన్ని పెంచుతున్నాయి.
