చాలా మంది ఇళ్లకు అనుకోని గెస్ట్‌లు వస్తుంటారు. మాంసాహారం తినే వారు గెస్ట్ లు వచ్చినప్పుడు నాన్ వెజ్ కు ప్రాధాన్యత ఇస్తారు. అప్పటికప్పుడు స్పైసీగా ఉండే నాన్ వెజ్ రడీ చేయాలంటే కష్టం. అందుకే నెల రోజుల పాటు నిల్వ ఉండే ఫిష్ పచ్చడి.. రొయ్యల చట్నీ ఉంటే చాలు.. మీ ఇంటికి వచ్చిన గెస్ట్‌లకు మీరు జీవితాంతం గుర్తుండి పోతారు. మరి ఈస్టోరీలో వాటిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..!
ఫిష్ పచ్చడి తయారీకి కావలసినవి
- చేప ముక్కలు: కిలో
- ఆవాలు : మూడు టీ స్పూన్లు
- మెంతులు : ఒక టీ స్పూన్
- జీలకర్ర : ఒక టీ స్పూన్
- తెల్ల మిరియాల పొడి: ఒక టేబుల్ స్పూన్
- కారం : అర కప్పు
- గరం మసాలా పొడి : ఒక టేబుల్ స్పూన్
- అల్లం, వెల్లుల్లి ముద్ద : మూడు టేబుల్ స్పూన్లు
- నిమ్మరసంబ అరకప్పు
- కరివేపాకు: పది రెమ్మలు
- ఎండు మిర్చి : నాలుగు
- పసుపు : ఒక టీస్పూన్
- ఉప్పు: తగినంత
- నూనె : పావుకిలో
ఫిష్ పచ్చడి తయారీ విధానం
బొచ్చు చేపల్లో ముళ్లు తక్కువుండి గుజ్జు ఎక్కువుగా ఉంటుంది. అందుకే వీటిని పికిల్కి ఉపయోగిస్తారు. చేప ముక్కల్ని శుభ్రం చేసితడి లేకుండా ఒక గిన్నెలో పెట్టాలి.
వాటిపై ఒక టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టీస్పూన్ గరం మసాలా, ఒక టీ స్పూన్ ఉప్పు, పావుటీస్పూన్ తెల్ల మిరియాల పొడి, ఒక టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, రెండు టీ స్పూన్లు నూనె వేసి ఫిష్ ముక్కలను బాగా కలిపి కొద్ది సేపు డీప్ ఫ్రిజ్‌లో పెట్టాలి.
స్టవ్ పై పాన్ పెట్టి ఆవాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఎండు మిర్చి, వేసి కొద్దిగా మిక్సీ పట్టి పొడి చెయ్యాలి. తర్వాత స్టవ్ పై బాండీ పెట్టి నూనె పోసి చేప ముక్కలను వేగించి ఒక ప్లేట్లో పెట్టాలి. తర్వాత మరొక పాన్ స్టవ్ పై పెట్టి చేప ముక్కలు వేగించాలి.
మిగిలిన నూనె... మూడు టేబుల్ స్పూన్లు వేసి దానిలో అల్లం వెల్లులి ముద్ద రెండు టేబుల్ స్పూన్లు వేసి వేగించాలి. తర్వాత అర టీ స్పూన్ గరం మసాలా పొడి, ధనియాల పొడి మిశ్రమం.. ఉప్పు, కారం మూడు టీ స్పూన్లు వేసి వేగించి స్టవ్ ఆఫ్ చెయ్యాలి.
ఒక గాజు సీసాలో ఈ మిశ్ర మాన్ని కొద్దిగా చేసి, కొన్ని చేప ముక్కలను వేసి మళ్లీ ఆ మిశ్రమాన్ని కొద్దిగా వేసి చేప ముక్కల్ని వేస్తూ సీసాలో నింపి అరబెట్టాలి. తర్వాత నిమ్మరసం వేస్తే చేప ముక్కల పికెల్ రెడీ..!
రొయ్యలతో నిల్వ పచ్చడి తయారీకి కావాల్సినవి
- రొయ్యలు: కిలో
- లవంగాలు: 25
- దాల్చిన చెక్క: సరిపడ
- ఆవాల పొడి: ఒక టేబుల్ స్పూన్
- నిమ్మ ఉప్పు: ఒక టేబుల్ స్పూన్
- కారం: 150 గ్రా.
- ఉప్పు: తగినంత
- నూనె: కిలో
- వెల్లుల్లి రెబ్బలు: 100గ్రా (పొట్టు తీసినవి)
- నిమ్మరసం: ఒక కప్పు (ఆరు నిమ్మకాయలు)
రొయ్యలతో నిల్వ పచ్చడి తయారీ విధానం
లవంగాలు, దాల్చిని చెక్క మిక్సీలో పొడి చెయ్యాలి. రొయ్యలను శుభ్రం చేసి పక్కన పెట్టాలి. స్టవ్ పై పాన్ పెట్టి నూనెవేసి రొయ్యలు ఎర్రగా అయ్యేంత వరకు వేగించాలి. తర్వాత వాటిని ఒక గిన్నెలోకి తీసి చల్లారనివ్వాలి.
రొయ్యల్లో కారం నిమ్మ ఉప్పు, ఆవాల పొడి, దాల్చిన చెక్క, లవంగాల పొడి, నిమ్మరసం వేసి బాగా కలపాలి. తర్వాత మిగిలి ఉన్ననూనె వేడి చేసి వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు,ఎండుమిర్చి వేసి వేగించాలి.
ఆ మిశ్రమాన్ని రొయ్యల్లో వేసి కలిపితే నోరూరించే రొయ్యల నిల్వ పచ్చడి రెడీ. దీనిని గాజు సీసాలో పెట్టి మూడు రోజుల తర్వాత తినాలి. ఈ పచ్చడి నెల రోజుల పైనే నిల్వ ఉంటుంది.
