ఎవరైనా అప్పుడప్పుడు అలసిపోవడం సహజమే. కానీ, రోజులుగా, వారాల తరబడి నీరసంగా లేదా అలసిపోయి ఉండటం, మాటిమాటికీ జలుబు, దగ్గు, జ్వరం రావడం వంటివి జరుగుతుంటే మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఈ బిజీ లైఫ్‌లో వీటిని చిన్న విషయాలుగా వదిలేస్తాం, కానీ అది పెద్ద సమస్యకు దారితీస్తుంది.
అయితే అలసిపోవడానికి కారణాలేంటి అంటే.. మనం తినే ఆహారంలో పోషకాలు లేకపోవడం, సరిగ్గా నిద్రపోకపోవడం, అధిక ఒత్తిడి వల్ల మన బాడీలోని రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దీనివల్ల శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడలేక ఎప్పుడూ అలసిపోయినట్లు ఉంటుంది.
ఇందుకు కారణాలు
*పోషకాల లోపం వల్ల ఒంట్లో రక్తం తక్కువగా ఉండటం, విటమిన్ బి12 లేదా విటమిన్ డి తగ్గడం...
*షుగర్ (Diabetes), థైరాయిడ్ లేదా ఇతర వ్యాధులు
*సరిగ్గా నిద్రపోకపోవడం, వ్యాయామం లేకపోవడం.
*ఏదైనా వైరల్ ఫీవర్ వచ్చాక శరీరం మళ్ళీ మామూలు స్థితికి రాకపోవడం.
అలసట లక్షణాలు
*బాగా నిద్రపోయినా కూడా ఉదయం లేవగానే ఇంకా అలసటగా అనిపించడం.
*రోజంతా నీరసంగా, ఓపిక లేనట్లు ఉండటం.
*తరచూ జలుబు, దగ్గు లేదా చర్మ వ్యాధులు రావడం.
*పనిమీద ఏకాగ్రత లేకపోవడం, చిన్న చిన్న విషయాలు మర్చిపోవడం
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
పెద్దవారికి వయసు పెరిగే కొద్దీ రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అందుకే షుగర్, బీపీ లేదా గుండె సమస్యలు ఉన్నవారు జాగ్రత్త పడాలి. ముఖ్యంగా హార్మోన్ల మార్పులు, రక్తహీనత సమస్యలు ఎదుర్కొనే మహిళలు అలాగే ఆఫీస్ లేదా ఇంటి పనుల వల్ల నిద్రలేక ఇబ్బంది పడుతూ ఒత్తిడిలో ఉన్నవారు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చెయ్యొద్దు.
మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే సొంత వైద్యం కాకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి. చిన్న చిన్న రక్త పరీక్షల ద్వారా ఆరోగ్య సమస్య ఏంటో తెలుసుకోవచ్చు. మంచి ఆహారం, సరైన నిద్ర, అవసరమైతే డాక్టర్ సూచించిన మందులు వాడితే మళ్ళీ ముందులా ఉత్సాహంగా మారొచ్చు. గుర్తుంచుకోండి... రోజులుగా అలసట అనేది కేవలం వయసు వల్ల వచ్చేది కాదు, అది మీ శరీరం ఇస్తున్న ఒక హెచ్చరిక!
