హైదరాబాద్‌లో విదేశీయులపై పోలీసుల స్పెషల్ డ్రైవ్.. అక్రమంగా ఉంటున్న 49 మంది గుర్తింపు

హైదరాబాద్‌లో విదేశీయులపై పోలీసుల స్పెషల్ డ్రైవ్.. అక్రమంగా ఉంటున్న 49 మంది గుర్తింపు
  • వీసా గడువు ముగిసిన విదేశీయులపై స్పెషల్ ఫోకస్
  • అక్రమ నివాసాలు, వీసా నిబంధనల ఉల్లంఘనపై  ప్రత్యేక తనిఖీలు
  • ఇప్పటివరకు 49 మంది గుర్తింపు.. 12 మంది స్వదేశాలకు తరలింపు 

హైదరాబాద్ సిటీ, వెలుగు: వీసా గడువు ముగిసినప్పటికీ భారత్‌‌‌‌‌‌‌‌లో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులను గుర్తించేందుకు పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ సిటీ పోలీస్ స్పెషల్ బ్రాంచ్ (ఫారినర్స్ మానిటరింగ్ సెల్), ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓ), స్థానిక పోలీసులు, ఐటీ సెల్ సంయుక్తంగా 2026 ఆగస్టు 31 నుంచి ఈ తనిఖీలను నిర్వహిస్తున్నాయి. ఇప్పటివరకు అక్రమంగా ఉంటున్న 49 మంది విదేశీయులను గుర్తించి హోల్డింగ్ సెంటర్లకు తరలించగా, వారిలో ఇప్పటికే 12 మందిని స్వదేశాలకు పంపించారు. 

ఈ తనిఖీల్లో కొందరు విదేశీయులు నకిలీ కరెన్సీ చెలామణి, మోసాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. ఒకరి వద్ద 250 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్టూడెంట్ వీసాపై వచ్చి గడువు ముగిసిన కొందరు, ఆస్పత్రుల్లో విదేశీ రోగులకు అనువాదకులు, మధ్యవర్తులుగా పనిచేస్తూ అధిక రుసుములు, బిల్లుల్లో కమీషన్లు పొందుతున్నట్టు గుర్తించారు. మరికొందరు వ్యభిచారం, మాదకద్రవ్యాల వినియోగానికి పాల్పడుతున్నట్టు పోలీసులు తెలిపారు.

నిర్వాహకులకు పోలీసుల హెచ్చరికలు

విదేశీయులకు వసతి కల్పించే ఇండ్ల యజమానులు, హాస్టళ్లు, హోటళ్లు, గెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌లు, సర్వీస్ అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ల నిర్వాహకులు వారి పాస్‌‌‌‌‌‌‌‌పోర్ట్, వీసా తదితర పత్రాలను పరిశీలించి, వివరాలను అధికారులకు సమర్పించాలి. వీసా గడువు ముగిసిన వారు, నకిలీ పత్రాలు కలిగిన వారు అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.