పిల్లల పెంపకం అంటే ప్రేమ, స్వేచ్ఛ, నియమాల మధ్య సమతూకం పాటించడం. “పిల్లలను ఎక్కువగా కట్టడి చేయొద్దు.. వాళ్లకు వాళ్లే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇవ్వాలి” అనే మాట తరచూ వినిపిస్తుంటుంది. కానీ పూర్తిగా నియంత్రణ లేకుండా పెరగడమే పిల్లల అభివృద్ధికి మంచిదని కాదు. వారికి స్పష్టమైన హద్దులు, స్థిరమైన నియమాలు, వాటిలో కొంత ఎంపిక స్వేచ్ఛ ఉంటేనే స్వీయ నియంత్రణ వంటి లక్షణాలు బలపడతాయని బాలల మనస్తత్వశాస్త్రం చెప్తోంది.
పిల్లలకు తమకు నచ్చినట్టు చేసుకునే పూర్తి స్వేచ్ఛ ఇస్తే వారు ఆనందంగా ఉండొచ్చని అనిపిస్తుంది. కానీ చిన్న వయసులో ఏది సరైనది, ఏది తప్పు, ఎక్కడ ఆగాలి అనే విషయాలను పిల్లలు పూర్తిగా అర్థం చేసుకోలేరు. అందుకే తల్లిదండ్రులు చూపించే స్పష్టమైన దిశ వారికి భద్రతా భావనను కలిగిస్తుంది.
నియమాలు ఉంటేనే స్పష్టత
ఇంట్లో కొన్ని సాధారణ నియమాలు ఉండటం పిల్లలకు ఎంతో ఉపయోగపడుతుంది. నిద్ర సమయం, చదువు సమయం, తెర ముందు గడిపే సమయం వంటి విషయాల్లో ఒక స్థిరమైన పద్ధతి ఉంటే పిల్లలకు ఏ సమయంలో ఏం చేయాలో ముందుగానే తెలుస్తుంది. దాంతో ప్రతిసారీ కొత్తగా వాదనలు, ఒత్తిడులు ఏర్పడే అవకాశం తగ్గుతుంది.
మాట ఒకటే.. అమలు కూడా ఒకటే
నియమం పెట్టడం కంటే దాన్ని స్థిరంగా పాటించడం ముఖ్యం. ఒకరోజు ఒక పనిని తప్పు అని చెప్పి, మరోరోజు అదే పనిని పట్టించుకోకపోతే పిల్లలకు అయోమయం కలుగుతుంది. అందుకే తల్లిదండ్రుల నిర్ణయాల్లో సాధ్యమైనంత స్థిరత్వం ఉండాలి. అదే పిల్లల్లో క్రమశిక్షణకు పునాది వేస్తుంది.
హద్దుల్లోనూ ఎంపిక ఉండాలి
నియమాలు అంటే పిల్లలపై పూర్తి నియంత్రణ కాదు. ఒక హద్దు లోపల వారికి చిన్నచిన్న ఎంపికలు ఇవ్వొచ్చు. ఉదాహరణకు ముందుగా నిర్ణయించిన నిద్ర సమయానికి పడుకోవాలి.. కానీ పడుకునే ముం దు ఏ కథ వినాలి, ఏ పుస్తకం చదవాలి అనేది పిల్లలే ఎంచుకునే అవకాశం ఇవ్వొచ్చు. ఇలా చేస్తే బాధ్యతతో పాటు నిర్ణయం తీసుకునే అలవాటు పెరుగుతుంది.
వయసుతోపాటు మారాలి
చిన్నపిల్లలకు ఎక్కువ మార్గదర్శకత్వం అవసరం. టీనేజర్లకు మాత్రం క్రమంగా మరింత స్వతంత్రత ఇవ్వాలి. స్నేహితులతో గడిపే సమయం, దుస్తులు, కార్యక్రమాలు వంటి విషయాల్లో వారి అభిప్రాయానికి విలువ ఇవ్వొచ్చు. అయితే భద్రత, బాధ్యత, సమయపాలన వంటి అంశాల్లో మాత్రం స్పష్టమైన హద్దులు కొనసాగాలి.
ప్రేమతో పెట్టిన హద్దులే బలం
తల్లిదండ్రులు ఎప్పుడూ కఠినంగా ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో రోజువారీ నియమాలు మారవచ్చు. కానీ పిల్లలకు “మా ఇంట్లో కొన్ని విషయాల్లో ఒక స్థిరమైన పద్ధతి ఉంటుంది” అనే నమ్మకం మాత్రం ఉండాలి. చివరికి తల్లిదండ్రులు పెట్టే హద్దులు క్రమంగా పిల్లలలోనే స్వీయ నియంత్రణగా మారాలి. అదే వారి ఎదుగుదలకు నిజమైన బలం.
