ఆధ్యాత్మికం: మౌనంతో ఏదైనా సాధించవచ్చు..శ్రీకృష్ణుడు.. బుద్దుడు విజయానికి కారణం ఇదే..!

ఆధ్యాత్మికం: మౌనంతో ఏదైనా సాధించవచ్చు..శ్రీకృష్ణుడు.. బుద్దుడు విజయానికి కారణం ఇదే..!

మనుషులలో జ్ఞానులు, అజ్ఞానులు అని రెండు వర్గాలవారు ఉంటారు. అజ్ఞానికి అకారణంగా కోపం వస్తుంది. ఆ కోపంలో పూనకం వచ్చిన వానిలా ఊగిపోతూ, నోటికి వచ్చినట్లు దుర్భాషలు పలుకుతాడు. జ్ఞాని ప్రతిస్పందించకుండా చిరునవ్వుతో మౌనంగా సమాధానం చెప్తాడు. అప్పుడు అజ్ఞానికి జ్ఞానం కలుగుతుందని పెద్దలు చెప్తారు. 

ఒకసారి బుద్ధుడు కళ్లు మూసుకుని ధ్యానంలో నిమగ్నమై ఉన్నాడు. ఆ సమయంలో ఒక శిష్యుడు అక్కడకు వచ్చి, ‘అయ్యా! ఒక చిన్న విన్నపం. ఇక్కడకు ఇప్పుడు ఒక వ్యక్తి వస్తున్నాడు. అతడు మిమ్మల్ని అనుక్షణం దూషిస్తూనే ఉన్నాడు. ఇక్కడకు వచ్చి కూడా మిమ్మల్ని దూషిస్తాడు’ అని పలికాడు. బుద్ధుడు సమాధానం చెప్పలేదు. పెదవుల మీద చిరునవ్వు చెక్కుచెదరలేదు. ఇంతలో ఆ వ్యక్తి రానే వచ్చాడు.

 బుద్ధుని వైపు చూస్తూ, తన నోటికి వచ్చినట్లు పరుషంగా మాట్లాడుతూనే ఉన్నాడు. బుద్ధుడు మౌనంగానే ఉన్నాడు. చివరకు ఆ వ్యక్తికి తిట్టడానికి ఓపిక పోయింది. నీరసంగా బుద్ధునితో, ‘మహానుభావా! నేను ఇంత తిడుతున్నా మీరు సమాధానం చెప్పకపోవడానికి కారణమేంటి. మీకు అసలు కోపం రాదా’ అని ప్రశ్నించాడు. అందుకు బుద్ధుడు అదే చిరునవ్వుతో, ‘నేను నీకు వంద వరహాలు ఇచ్చాననుకో. నువ్వు వాటిని స్వీకరించలేదనుకో. అప్పుడు అవి ఎవరికి చెందుతాయి’ అని ప్రశ్నించాడు. ‘నేను స్వీకరించలేదు కనుక అవి నీకే చెందుతాయి’ అన్నాడు. ‘ఇప్పుడు నువ్వు పరుషంగా పలికిన మాటలను నేను స్వీకరించలేదు. కనుక అవి నీకే చెందుతాయి. అవి నాకు చెందనప్పుడు నాకు ఎందుకు కోపం వస్తుంది’ అన్నాడు. అంతే ఆ వ్యక్తి బుద్ధుడి పాదాల మీద పడి, ‘మహానుభావా! నాకు జ్ఞానోపదేశం చేశారు. నేటి నుండి నేను ఎవ్వరినీ పరిహాసానికి కూడా దూషించను’ అన్నాడు. ఆ విధంగా బుద్ధుడు తన మౌనం ద్వారా ఆ అజ్ఞానికి జ్ఞానాన్ని ప్రసాదించాడు. 

మహాభారతంలో శ్రీకృష్ణుడు సైతం ఎవ్వరు ఏ విధంగా పలికినా చిరునవ్వుతోనే సమాధానమిస్తాడు. అందుకే ఆయనను ‘నవ్వురాజిల్లెడు మోమువాడు’ అన్నాడు పోతన. దుర్యోధనుడు ఆడిన మాయాజూదంలో ధర్మరాజు ఓడిపోయాడు. ఆ సమయంలో దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని మొదలైనవారంతా నోటికి వచ్చినట్లు మాట్లాడారు. ధర్మరాజు మారు మాట్లాడలేదు. పదమూడు సంవత్సరాలు అరణ్య, అజ్ఞాత వాసాలు పూర్తి చేసుకుని, కురుక్షేత్ర యుద్ధం చేసి, కౌరవులను హతం చేసి, తగిన సమాధానం చెప్పాడు.

 విజ్ఞులైన వారు ఎంతటి సమస్య ఎదురైనా.. వెంటనే స్పందించరు. సమయం వచ్చేవరకు నిరీక్షించి, ఆ తరువాతే ఆ సమస్యను తగు పరిష్కారంతో అధిగమిస్తారు. పంచతంత్రంలో సింహము కుందేలు కథ తెలిసినదే. తనను తాను రక్షించుకోవడానికి కుందేలు ఉపాయం ఆలోచించింది. ఆ ఉపాయంతోనే సింహాన్ని ఎదుర్కొంది. ఆ విధంగా తనను తాను బతికించుకుంది. మిగిలిన జంతువులను కూడా సింహం బారినుండి బయటపడేలా సహాయపడింది. 

మౌర్య సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న నవనందులు... చాణుక్యుడిని ఎన్నోరకాలుగా అవమానించారు. చాణక్యుడు మౌనంగా నిరీక్షించాడు. చంద్రగుప్తుడికి సకల విద్యలు నేర్పుతూ, అతడిని సింహాసనం ఎక్కించడానికి తగిన విధంగా తీర్చిదిద్దాడు. ఒక సుముహూర్తాన నవ నందులను హతం చేసి, చంద్రగుప్తుడిని రాజును చేసి, తనకు జరిగిన అవమానానికి మౌనంగానే సమాధానమిచ్చాడు. ఇతరులకు జ్ఞాన బోధ చేయాలన్నా, వారు చేసిన అపకారానికి ప్రతీకారం తీర్చుకోవాలన్నా.. తగిన సమయం వచ్చేవరకు మౌనంగా నిరీక్షించాలని పెద్దలు చెప్తారు. దీనినే సుమతీ శతకకారుడు...

తన కోపమె తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ
తన సంతోషమె సౌఖ్యము
తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ

అన్నాడు. కోపంలో ఆవేశపడితే అది అపకారమే చేస్తుంది. శూర్పణఖకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు రావణుడు. సీతమ్మను అపహరించాడు. లంకలో బంధించాడు. రాముడు కోతిమూకలతో స్నేహం చేసి, శాంతంగా రావణుడి మీదకు యుద్ధానికి వచ్చాడు.

 రావణుడి వంశాన్ని అంతం చేశాడు. రావణుడు ఆవేశంలో సీతమ్మను అపహరించిన కారణంగానే లంకకు ఇంత చేటు జరిగిందని వాల్మీకి మనకు జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. కార్యసాధనకు మౌనాన్ని మించిన ఆయుధం లేదు కనుకనే స్వాతంత్య్ర పోరాటంలో గాంధీజీ సత్యాగ్రహమే ఆయుధంగా పోరాడాడు.

– డా. పురాణపండ వైజయంతి

మీరూ లైఫ్​కి పిల్లల కథలు పంపాలి అనుకుంటున్నారా? అయితే.. కథను హామీపత్రంతోపాటు
[email protected] కి మెయిల్​ చేయండి.