మాఘమాసం కొనసాగుతుంది. ఈ నెలలోనే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయింది. మాఘమాసం కృష్ణ పక్షం ఏకాదశి తిథి రోజు విష్ణుమూర్తిని పూజిస్తే ప్రతి పనిలో విజయం చేకూరుతుందని పండితులు చెబుతున్నారు. మాఘమాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి విజయ ఏకాదశి అంటారు. ఈ ఏడాది అలాంటి విశిష్టమైన రోజు ఫిబ్రవరి 13 వ తేది వచ్చింది. ఆరోజు ఎలాంటి నియమాలు పాటించాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
మాఘ మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి విజయ ఏకాదశి అంటారు. ఆ రోజు ఏ పనిచేసినా విజయం సాధిస్తుందని పండితులు చెబుతుంటారు. పురాణాల ప్రకారం ఏకాదశి తిథి శ్రీ మహావిష్ణువును పూజిస్తే తెలిసీ... తెలియక చేసిన పాపాలన్ని కూడా తుడిచిపెట్టుకుపోతాయని శాస్త్రాల ద్వారా తెలుస్తుంది.
ఈ సంవత్సరం విజయ ఏకాదశి ఫిబ్రవరి 13 వ తేదీన వచ్చింది. వృత్తి(ఉద్యోగ, వ్యాపార) పరంగా విజయాన్ని అందుకోవాలంటే ఆరోజున విష్ణుమూర్తిని ప్రత్యేకంగా పూజించాలని పండితులు చెబుతున్నారు. ఈ ఏకాదశి రోజు మనం ఏ పని ఆచరించినా.. ఏ కోరికలు కోరుకున్న అవి వెంటనే సఫలమవుతాయట.
విజయ ఏకాదశి పూజా విధానం ఇదే..!
- బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేయాలి.
- ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అలాగే పూజ గదిని అలంకరించుకోవాలి.
- లక్ష్మీ నారాయణుల ఫొటోకు గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి. ఒకవేళ లక్ష్మీ నారాయణుల ఫొటో లేకపోతే రాముడు, కృష్ణుడు, నరసింహాస్వామి.. ఇలా విష్ణు సంబంధమైన ఫొటో తీసుకుని దానికి గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి.
- ఫొటో ఎదురుగా వెండి ప్రమిద పెట్టి అందులో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి మూడు వత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి.
- విష్ణుమూర్తికి ఇష్టమైన పసుపు రంగు పూలతో పూజించాలి. అంటే తెల్లగన్నేరు, నందివర్దనం, తుమ్మి పూలు, జాజిపూలు వీటిలో ఏ పూలతోనైనా స్వామిని పూజించాలి. పూలతో పూజించేటప్పుడు ఓం నమో నారాయణాయ.... ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ రెండు మంత్రాలలో ఏదైనా ఒక మంత్రాన్ని 21 సార్లు చదువుతూ పూలతో పూజించాలి.
- ఆ తర్వాత తీపి పదార్థాలు నైవేద్యంగా పెట్టి హారతి ఇవ్వాలి.
- విష్ణు సంబంధమైన(రాముడు, కృష్ణుడు, నరసింహాస్వామి, వేంకటేశ్వర స్వామి) ఆలయానికి వెళ్లాలి.
- ఆ తర్వాత ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు సరి సంఖ్యలో చేయాలి.
- దేవాలయంలో ధ్వజస్తంభం వద్ద దీపం వెలిగించాలి. ఈ దీపాన్ని గరుడధ్వజ దీపం అంటారు.
- ఏకాదశి రోజు ఉపవాస దీక్ష పాటించాలి. పాలు..పండ్లు తీసుకోవచ్చు.
- రోజంతా పండ్లు తినాలి. రాత్రి మేల్కొని జాగారం చేయాలి
- నిరుపేదలకు దానం చేయండి. పేదలకు ఆహారం అందించండి.
- భగవన్నామస్మరణలో గడపాలి. ఎవరిని దూషించకూడదు. ద్వాదశి రోజు పూజ చేసి.. అనంతరం సాత్వికాహారం తినాలి
ఆ తరువాత దేవాలయానికి వెళ్లి ధ్వజస్తంభం వద్ద మట్టి ప్రమిదను ఉంచి అందులో నువ్వుల నూనె పోసి ఎనిమిది వత్తులను విడిగా వేసి దీపం పెట్టాలి.ఉపవాసం రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి. దేవాలయంలో ముగ్గులు వేయడం, ఆలయాన్ని చీపురుతో శుభ్రం చేయడం, ప్రసాదాలు పంచిపెట్టడం వంటివి చేస్తే ఇంకా మంచిదని చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారంతో పండితుల సలహాలను వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
