ఒక యాక్టర్‌గా ఎన్నో రకాల పాత్రలు చేస్తుంటారు. కానీ, వాళ్లకు ఆల్రెడీ ఏదైనా కళ ఉంటే దాన్ని ఒక సినిమాలో ఒక పాత్రతో నెరవేర్చుకునే అదృష్టం మాత్రం కొందరికే దక్కుతుంది. ఆ విషయంలో సుష్మిత చాలా లక్కీ. క్లాసికల్ డాన్సర్ అయిన ఆమె తన కళను వెండితెరపై ‘నాట్యం’ సినిమా ద్వారా ప్రదర్శించింది. ఇప్పుడు మరోసారి క్లాసికల్ డాన్సర్‌గా ఇప్పుడు మలయాళంలో మమ్ముట్టి సినిమాలో కనిపించింది. రెండుసార్లు తన కళను ప్రదర్శించే పాత్రలు దక్కించుకున్న కొద్దిమంది నటుల్లో ఈమె ఒకరు అనడంలో అతిశయోక్తి లేదు. పైగా గౌతమ్ వాసుదేవ్ మెనన్ డైరెక్షన్లో, స్టార్ యాక్టర్ మమ్ముట్టితో పనిచేసే చాన్స్ రావడంతో ఆమె ఆనందానికి అవధుల్లేవ్.
చెన్నైలో పుట్టిన సుష్మిత ఉడుపిలో పెరిగింది. బెంగళూరులో సెటిల్ అయింది. ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ చేసింది. క్లాసికల్ డాన్సర్. చాలామంది యాక్టర్స్లానే తను కూడా అనుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చింది. ఒక ప్రి యూనివర్సిటీ కోర్స్ కోసం చదువుకు కొంచెం బ్రేక్ తీసుకుంది. కానీ, ఆ తర్వాత క్లాసికల్ డాన్స్ నేర్చుకోవడం కంటిన్యూ చేసింది.
2020 నుంచి 2022 వరకు ‘కావ్యాంజలి’ అనే కన్నడ సీరియల్లో నటించింది. తెలుగు సినిమా ‘నాట్యం’తో వెండితెరకు పరిచయం అయింది. అందులో సైడ్ డాన్సర్‌గా కనిపించింది. ఒక ఫ్రెండ్ ద్వారా ఆమెకు ‘చౌ చౌ బాత్’ అనే కన్నడ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీ అయింది. ఈ ఏడాది తమిళంలో లవ్ మ్యారేజ్ అనే మూవీ చేసింది. రీసెంట్గా ప్రణవ్ మోహన్‌లాల్ నటించిన ‘డైస్ ఇరియా’ అనే థ్రిల్లర్ మూవీలో కనిపించింది. ‘డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్’ అనే మలయాళ సినిమాలో మమ్ముట్టితో కలిసి నటించింది. ఒక కాస్ట్యూమ్ డిజైనర్ సుష్మిత సోషల్ మీడియా పోస్ట్‌లు చూసి ఈ సినిమాకు రికమెండ్ చేసింది. ‘‘నాకు శోభన, భానుప్రియ, వైజయంతి మాలా లాంటి నటీమణులే స్ఫూర్తి”అంటోన్న ఈ నటి ఫిల్మ్ జర్నీ ఆమె మాటల్లోనే...
►ALSO READ | Shambhala Trailer: ఉత్కంఠగా ఆది ‘శంబాల’ ట్రైలర్.. డిసెంబర్ 25న థియేటర్లో బిగ్ బ్లాస్ట్..
ఒక పర్ఫార్మర్గా సోషల్ మీడియా నా కళను ప్రదర్శించే ప్లాట్‌ఫాంగా భావిస్తా. అందుకే ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటా. ఫొటోలు, రీల్స్ ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటా. నా రెట్రో ఫొటో షూట్లు, నా ఫొటోగ్రాఫర్ ఫ్రెండ్ బిప్లబ్ తీస్తుంటాడు. కాస్ట్యూమ్ డిజైనర్ సమీరా నా వర్క్స్‌ని సోషల్ మీడియాలో చూసి డొమినిక్లో నందిత పాత్రకు నా పేరు సజెస్ట్ చేసింది. ఆడిషన్ ద్వారా నేను సెలక్ట్ అయ్యాక ఆ పాత్రకు తగ్గట్టు తనే నా కాస్ట్యూమ్ డిజైన్ చేసింది. డాన్స్‌లో ఆర్టిస్ట్ కొన్ని మూవ్‌మెంట్స్‌తో ఆడియెన్స్‌తో కమ్యూనికేట్ అవుతారు. సంతోషం, బాధ, ప్రేమ వంటి ఎమోషన్స్‌ని బాడీ మూవ్మెంట్స్ ద్వారా తెలియజేస్తారు.
డొమినిక్ మూవీలో నా పాత్ర మల్టీ లేయర్స్‌తో ఉంటుంది. నందిత అనే ఒక డాన్సర్ స్క్రీన్‌పై కనిపించగానే ఒక మిస్టరీగా కనిపిస్తుంటుంది. ఈ సినిమాలో నా ఆర్ట్‌ను పర్ఫార్మ్ చేసే అవకాశం దొరికింది. ఇందులో ‘మార్గళి తింగళ్’ అనే పాటకు క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేశాను. ఆ పాట వీడియో సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఆ ఒక్క సాంగ్‌లోనే నందిత క్యారెక్టర్ మిస్టీరియస్ అని అర్థమవుతుంటుంది. ఆ సాంగ్‌కి యూట్యూబ్‌లో పెట్టే కామెంట్స్ చూసి చాలా హ్యాపీగా ఉంది. అందరికీ రెస్పాండ్ అవ్వాలని ప్రయత్నిస్తున్నా. ఈ పాటకు డాన్స్ కొరియోగ్రఫీ చేసింది బృంద మాస్టర్. ఆ క్రెడిట్ అంతా ఆవిడదే.
ఈ సినిమా ఎడిటర్ ఆంటోనీ క్లైమాక్స్ చూసి నా నెంబర్ కనుక్కుని మరీ ఫోన్ చేసి చాలా అప్రిషియేట్ చేశారు. ఈ సినిమా డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మెనన్ కూడా మెచ్చుకున్నారు. గౌతమ్‌ని ఫస్ట్ టైం ఆడిషన్లో కలిశాను. కళ్లు చాలా ఎక్స్‌ప్రెసివ్‌గా ఉండాలి అని చెప్పారాయన. అందుకోసం నన్ను మేకప్ వేసుకుని రమ్మన్నారు. ఈ డైరెక్టర్ తన ఆర్టిస్ట్ స్కిన్ టోన్ కూడా క్యారెక్టర్‌కి సూట్ అయ్యేలా ఉండాలి అని పర్టిక్యులర్‌గా ఉన్నారు. కాస్ట్యూమ్స్ కూడా అలాగే రెడీ చేయించారు.
ఈ సినిమా విషయంలో చాలా మెమొరబుల్ మూమెంట్స్ ఉన్నాయి. లైఫ్‌లాంగ్ గుర్తుండిపోయే సినిమా ఇది. చాలామందికి మమ్ముట్టితో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉంటుంది. గౌతమ్ డైరెక్షన్లో నటించాలని ఉంటుంది. వీటితోపాటు నాకు మరో ప్లస్ పాయింట్ ఏంటంటే.. నా డాన్స్. ఒక డాన్సర్‌గా నా కళను ప్రదర్శించే పాత్ర మరోసారి రావడం ఒక ఎత్తైతే, ఇలాంటి కాంబినేషన్లో వస్తుందని అస్సలు ఊహించలేదు. పైగా నా పాత్రకు యాక్టింగ్ పరంగానూ ఎంతో స్కోప్ ఉన్న మూవీ ఇది. అందుకే ఇది నాకు చాలా చాలా స్పెషల్ ఫిల్మ్.
మమ్ముట్టితో నటించాలంటే..
ఈ సినిమాలో మమ్ముట్టితో నటించాలంటే కొంచెం టెన్షన్ పడ్డాను. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలంటే ఎంత హ్యాపీగా ఫీలయ్యేదాన్నో అంతే నెర్వస్‌గానూ ఉండేది. మా ఇద్దరి కాంబినేషన్లో సీన్ అంటే డైలాగ్స్ పక్కాగా నేర్చుకుని సెట్‌కి వెళ్లేదాన్ని. ఆయన టైం నేను అస్సలు వేస్ట్ చేయాలనుకోలేదు. ఎందుకంటే ఆయన మహాశిఖరం అయితే నేను దానిముందు చిన్నరాయిని. అందుకని చాలా ప్రిపేర్డ్‌గా ఉండేదాన్ని. డైరెక్టర్‌తో డిస్కస్ చేసేదాన్ని.
రెండో ఆప్షన్
నా బ్యాక్‌గ్రౌండ్ అంతా చెన్నై, బెంగళూరు కావడంతో తమిళం, కన్నడ సినిమాలే చూస్తూ పెరిగా. ఈ మధ్య కాలంలోనే మలయాళం సినిమాలకు వస్తోన్న క్రేజ్ చూసి నేను కూడా అట్రాక్ట్ అయ్యా. నాకు మలయాళం రాదు. కానీ నా వాయిస్‌లోనే డబ్బింగ్ చెప్పాలని నేర్చుకోవడానికి ప్రయత్నించా. మొదట్లో భాషను సరిగా పలకడం రాలేదు. దాంతో డైరెక్షన్ టీం రెండు ప్లాన్స్ చెప్పారు. ఒకటి నేను మలయాళం మాట్లాడాలి. లేదా మలయాళీ అమ్మాయే తమిళంలో మాట్లాడాలి అని. మమ్ముట్టి సపోర్ట్‌తో రెండో ఆప్షన్ ఓకే చేశారు. ఫైనల్‌గా నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పా. మరిన్ని మలయాళం కథల్లో పాత్రలు పోషించాలనుంది.
