Shambhala Trailer: ఉత్కంఠగా ఆది ‘శంబాల’ ట్రైలర్.. డిసెంబర్ 25న థియేటర్లో బిగ్ బ్లాస్ట్..

Shambhala Trailer: ఉత్కంఠగా ఆది ‘శంబాల’ ట్రైలర్.. డిసెంబర్ 25న థియేటర్లో బిగ్ బ్లాస్ట్..

హీరో ఆది సాయి కుమార్ నటించిన అప్ కమింగ్ రిలీజ్ మూవీ ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’. యుగంధర్ ముని దర్శకత్వంలో రాజశేఖర్‌‌ అన్నభీమోజు, మహిధర్ రెడ్డి నిర్మించారు. క్రిస్మస్‌ కానుకగా డిసెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆదివారం (డిసెంబర్ 21న) హీరో నాని ట్రైలర్ రిలీజ్ చేసి, చిత్ర బృందానికి విషెస్ తెలిపారు.

ట్రైలర్ ఎలా ఉందంటే.. సూపర్ నేచురల్ థ్రిల్లర్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో రిలీజైన శంభాలా ట్రైలర్ ఉత్కంఠ కలిగిస్తోంది. ఇందులో జియో సైంటిస్ట్‌‌గా (భౌగోళిక శాస్త్రవేత్తగా) ఆది కనిపించాడు. టైటిల్కు తగ్గట్టుగానే ట్రైలర్ ఆసక్తిరంగా సాగింది. ‘పంచభూతాల్ని శాసిస్తుందంటే ఇది సాధారణమైంది కాదు’ అనే డైలాగ్‌తో ట్రైలర్ ఆసక్తిగా మొదలైంది. మిస్టరీ, మేజిక్, మరియు మానవ విపత్తుల అంశాలను ప్రస్తావించి సినిమాపై క్యూరియాసిటీ పెంచారు. శ్రీచరణ్ పాకాల అందించిన నేపథ్య సంగీతం ఉత్కంఠను పెంచింది.

ఈ కథనం 1980ల నాటి వాతావరణంలో, ఒక మారుమూల గ్రామం చుట్టూ తిరుగుతుంది. ఆ ఊరిలో జరుగుతున్న అంతుచిక్కని హత్యలు, అతీంద్రియ సంఘటనలను పరిశోధించడానికి జియో-సైంటిస్ట్ విక్రమ్‌గా ఆది సాయికుమార్ రంగంలోకి దిగుతాడు. దేవుళ్లు, అద్భుతాలు అంటూ దేనినీ నమ్మని హేతువాది అయిన విక్రమ్‌కు, ఈ మిస్టికల్ శక్తిని ఛేదించడం ఒక పెను సవాల్ మారుతుంది.. లాజిక్‌కు, మర్మమైన శక్తులకు మధ్య జరిగే ఈ భీకర పోరాటమే సినిమా కథాంశం.

దర్శకుడు యుగంధర్‌ ముని ఈ చిత్రాన్ని గతంలో ఎప్పుడూ భారతీయ తెరపై చూపించని పాయింట్‌తో, అద్భుతమైన విజువల్స్‌తో తీర్చిదిద్దారు. ఆది సాయికుమార్ జియో-సైంటిస్ట్‌గా సరికొత్త అవతార్‌లో ఆకట్టుకున్నారు. అర్చన అయ్యర్‌ కథానాయికగా నటించగా, స్వాసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. డిసెంబర్ 25న ఈ మిస్టికల్ వరల్డ్‌ను థియేటర్లలో చూడటానికి ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.