వర్సటైల్ యాక్టర్ మనోజ్ బాజ్‌పాయ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇటీవల ‘ది ఫ్యామిలీ మ్యాన్–3’ వెబ్ సిరీస్‌తో పాటు, ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’, ‘ఇన్‌స్పెక్టర్ జెండే’ వంటి ఓటీటీ చిత్రాల్లో నటించిన ఆయన, ఇప్పుడు మరో కొత్త సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అదే ‘ఘూస్‌ఖోర్ పండత్’ (Ghuskor Pandath). నీరజ్ పాండే సమర్పణలో రితేష్ షా దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్ నిర్మించింది.
మంగళవారం (ఫిబ్రవరి 3) విడుదలైన టీజర్ పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. అయితే టీజర్ కంటెంట్ కంటే, ఇప్పుడు సిరీస్ టైటిల్‌పై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. ఈ మూవీ టైటిల్ బ్రాహ్మణ వర్గాన్ని టార్గెట్ చేసేలా ఉందని భావిస్తూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో మేకర్స్పై మండిపడుతున్నారు. టైటిల్‌లో ఉపయోగించిన పదజాలం కుల వివక్షను సూచించేలా ఉందని తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
కంటెంట్‌కు అనుగుణంగా ప్రస్తుతం ఎన్నో టైటిల్స్ అందుబాటులో ఉండగా, తమ సామాజిక వర్గాన్ని కించ పరిచేలా టైటిల్ పెట్టడం ఏంటి? అని ఆ వర్గానికి చెందిన ఆడియన్స్ ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే వీలైనంత త్వరగా టైటిల్ను మార్చాలని, లేని పక్షంలో సినిమాను బ్యాన్ చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ వివాదంపై నెట్‌ఫ్లిక్స్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాకపోవడంతో, సోషల్ మీడియాలో మరింత ఉడుకు రేగుతోంది.
‘ఘూస్‌ఖోర్ పండత్’ మూవీ వివాదం
ఈ మూవీలో మనోజ్ బాజ్‌పాయ్ అవినీతిపరుడైన పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నాడు. సినిమాలో ఆయన పాత్ర పేరు అజయ్ దీక్షిత్ అయినప్పటికీ, కథలోని ఇతర పాత్రలు అతన్ని ఎక్కువగా ‘పండిత్’ అని పిలుస్తుంటారు. అయితే లంచాలు తీసుకునే వ్యక్తి కథకు ‘ఘూస్‌ఖోర్’ (లంచగొండి) అనే పదానికి ‘పండిత్’ అనే మాటను కలిపి టైటిల్‌గా పెట్టడం సరైంది కాదని కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ పేరు బ్రాహ్మణ సమాజాన్ని, పండిత వర్గాన్ని అవమానించే విధంగా ఉందని వారు విమర్శిస్తున్నారు.
మూవీ కథేంటంటే:
‘ఘూస్‌ఖోర్ పండత్’.. మూవీ ఢిల్లీ బ్యాక్ డ్రాప్ లో సాగే క్రైమ్ థ్రిల్లర్. ఇందులో మనోజ్ బాజ్‌పాయ్ పోషించిన అజయ్ దీక్షిత్ అలియాస్ పండిత్.. ఒక అవినీతి పోలీస్ అధికారి. అతను డబ్బు సంపాదించడం కోసం విభిన్న కోణాల్లో క్రైమ్ చేయడానికి కూడా వెనుకాడడు. అలాంటి పండిత్.. ఒకానొక టైంలో ఓ అంతర్జాతీయ కుట్రలో చిక్కుకుంటాడు. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడిన ఒక యువతి వివరాలు కనుగొనే ప్రయత్నంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు అనేది కథాంశం.
