కృష్ణా జలాల విషయంలో పాలమూరు ప్రజలను మోసం చేసింది మీరే నని కేసీఆర్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రూ.25 వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు నీరు ఇవ్వలేదని విమర్శించారు. పాలమూరు విషయంలో, ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ వ్యాఖ్యలు అబద్ధాలని అన్నారు.
పదేళ్ల పాలనలో లక్ష ఎకరాలకు కూడా కొత్త ఆయకట్టు నీరు ఇవ్వలేదని అన్నారు మంత్రి ఉత్తమ్. పాలమూరు రండారెడ్డిలో 45 టీఎంసీలు తగ్గించామన్నది అబద్ధం.. ఇరిగేషన్ ను నాశనం చేసింది మీరు..రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది మీరు.. కృష్ణా జలాల విషయంలో పాలమూరును మోసం చేసింది మీరు.. 2023 ఏప్రిల్ 12 న డీపీఆర్ వెనక్కు పంపారు.. అప్పుడు సీఎం, ఇరిగేషన్ మంత్రి మీరే కదా..? మీరు ఇచ్చిన జీవో ప్రకారమే 45 టీఎంసీలు కృష్ణా నుంచి, 45 టీఎంసీలు గోదావరి నుంచి ఇవ్వాలని కోరాం. 500 టీఎంసీలు ఏపీ వాడుకునేందుకు మీరు రాసివ్వలేదని చెప్పే దమ్ముందా..? అంటూ ప్రశ్నించారు మంత్రి ఉత్తమ్.
ఉమ్మడి రాష్ట్రంలో 750 టీఎంసీలు తరలించుకుపోతే.. మీ పాలనలో 1400 టీఎంసీలు తరలించుకోయారు. ఏపీ నీటిని తరలించుకుపోతుంటే ఏం చేశారు..? అందుకు సహకరించింది మీరు కాదా..?
ఇప్పుడు చెప్పండి ఎవరు మోసం చేశారో అంటూ కేసీఆర్ పై విరుచుకుపడ్డారు మంత్రి ఉత్తమ్.
బీఆర్ఎస్ హయాంలో లక్షా 80 వేల కోట్లు ఖర్చు చేసి రైతులకు చేసింది సున్నా అని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పాలమూరు రంగారెడ్డికి 7 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే సమర్థవంతంగా కృష్ణా ట్రిబ్యునల్ లో పోరాడుతున్నామని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న దేవాదులను పట్టించుకోలేదని విమర్శించారు.
మీరు లక్ష కోట్లు ఖర్చు చేసిన కాళేశ్వరం కూలిపోయింది.. ప్రాణహిత చేవెళ్ల రద్దు చేసి రాష్ట్రానికి అన్యాయం చేశారు. పదేళ్లలో కల్వకుర్తి, నెట్టెంపాడు, డిండి, బీమా, ఎస్ ఎల్ బీసీ మొదలైన ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు ఆపాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాం..ఇప్పుడు చెప్పండి ఎవరు మోసం చేశారో..? కేసీఆర్ కరెక్ట్‌గా ప్రిపేరై రండి, లేదంటే ఇలాగే లెక్కలు తెలియకుండా మాట్లాడుతారు. కృష్ణా బేసిన్‌లో కేసీఆర్ చేసింది దగా, మోసం అంటూ ఫైరయ్యారు మంత్రి ఉత్తమ్.
