పైసలు ఇచ్చాకే.. ప్రమాణ స్వీకారం చెయ్!..

పైసలు ఇచ్చాకే.. ప్రమాణ స్వీకారం చెయ్!..
  •  సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం చేస్తే రూ. 50 లక్షలు ఇస్తానని అభ్యర్థి హామీ 
  • ఎన్నుకున్నాక  మాట మార్చాడంటున్న వార్డు సభ్యులు, గ్రామస్తులు

యాదగిరిగుట్ట, వెలుగు: హామీ మేరకు పంచాయతీ అభివృద్ధికి రూ.50 లక్షలు ఇచ్చాకే సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేయాలని, లేదంటే అడ్డుకుంటామని యాదాద్రి జిల్లా మైలారుగూడెం వార్డు సభ్యులు, గ్రామస్తులు తేల్చిచెప్పారు. ఆదివారం పంచాయతీ భవనం వద్ద మీడియాతో మాట్లాడారు. తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ గా బీఆర్ఎస్ మద్దతుతో మారెడ్డి కొండల్ రెడ్డి, కాంగ్రెస్ మద్దతుతో కాదూరి కృష్ణ నామినేషన్లు వేశారు. 

తనను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామాభివృద్ధికి రూ.50 లక్షలు ఇస్తానని కొండల్ రెడ్డి హామీ ఇచ్చారు. మరో అభ్యర్థి కృష్ణను ఒప్పించి నామినేషన్ విత్ డ్రా చేయించి అగ్రిమెంట్ రాసుకుని సర్పంచ్ ఎన్నికను గ్రామస్తులు ఏకగ్రీవం చేశారు. కాగా.. ప్రమాణ స్వీకారానికి ముందే  హామీ మేరకు రూ.50 లక్షలు ఇవ్వాలని కొండల్ రెడ్డిని వెళ్లి అడగగా, వెంటనే ఇవ్వాలనే రూల్ ఏమైనా ఉందా.? అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడని గ్రామస్తులు తెలిపారు.

 ఒప్పందం మేరకు ముందుగా ఇవ్వకుంటే  సోమవారం ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకుంటామని కాంగ్రెస్ వార్డు సభ్యులు, గ్రామస్తులు తేల్చిచెప్పారు. దీనిపై కొండల్ రెడ్డిని వివరణ కోరగా.. గ్రామాభివృద్ధి కోసం ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నానని తెలిపారు. ప్రతి కులానికి చెందిన ఇద్దరు పెద్ద మనుషులతో కమిటీ వేసి.. డబ్బు ఇస్తానని స్పష్టంచేశారు. వార్డు సభ్యుల ఆరోపణల్లో వాస్తవం లేదని, డబ్బులపై ఎలాంటి నిర్లక్ష్య వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు.

 ఉప సర్పంచ్ బండి అశోక్ గౌడ్, కాంగ్రెస్ వార్డు సభ్యులు కాదూరి లలిత, గుండ్లపల్లి కవిత, చిన్నం గణేశ్, రాపోలు సతీశ్​రెడ్డి, బీఆర్ఎస్ వార్డు సభ్యులు గోపాల పద్మ, నాతి నర్సింహులు, అల్లం మానస, మదర్ డెయిరీ డైరెక్టర్ పుప్పాల నర్సింహులు, మాజీ ఉప సర్పంచులు గోపాల యాదగిరి, కాదూరి కృష్ణ ఉన్నారు.