భారత్-అమెరికా ట్రేడ్ డీల్: 6.9 శాతానికి చేరనున్న జీడీపీ.. గోల్డ్‌మన్ సాక్స్ రిపోర్ట్

భారత్-అమెరికా ట్రేడ్ డీల్: 6.9 శాతానికి చేరనున్న జీడీపీ.. గోల్డ్‌మన్ సాక్స్ రిపోర్ట్

గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం 'గోల్డ్‌మన్ సాక్స్' తీపి కబురు అందించింది. అమెరికా ప్రభుత్వం భారతీయ దిగుమతులపై సుంకాలను తగ్గించనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో.. 2026 సంవత్సరానికి భారత నిజమైన జీడీపీ వృద్ధి అంచనాను 20 బేసిస్ పాయింట్లు పెంచి 6.9%కి చేర్చింది. గతంలో అమెరికా విధిస్తామన్న 34% సుంకాల కంటే.. ఇప్పుడు అమలు చేయబోయే టారిఫ్స్ రేటు ఏకంగా 18 శాతానికి తగ్గటంతో గోల్డ్‌మన్ సాక్స్ తన అంచనాలను పంచుకుంది. 

అమెరికా తన టారిఫ్ విధానంలో మార్పులు చేయడం వల్ల ముఖ్యంగా భారతీయ టెక్స్‌టైల్స్, జెమ్స్ అండ్ జ్యువెలర్స్ రంగానికి భారీ ప్రయోజనం చేకూరనుంది. గతంలో వీటిపై 50% వరకు ఉన్న సుంకాలను ఇప్పుడు సున్నాకి తగ్గించే అవకాశం ఉందని రిపోర్ట్ పేర్కొంది. మెషినరీ, మెటల్స్.. రవాణా రంగాలకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉన్నప్పటికీ, భారతీయ ఎగుమతులపై సగటున 20 శాతం మేర సుంకాల భారం తగ్గుతుందని గోల్డ్‌మన్ సాక్స్ విశ్లేషించింది. మరోవైపు అమెరికా నుండి వచ్చే వ్యవసాయ దిగుమతుల్లో 60-70% ఉత్పత్తులపై భారత్ కూడా సున్నా లేదా అతి తక్కువ సుంకాలను విధించే అవకాశం ఉంది.

►ALSO READ | భారతీయ AI స్టార్టప్ Sarvam AI సంచలనం: జెమినీ, చాట్‌ జిపిటిలని మించిపోయిందిగా..

మెరుగైన వాణిజ్య పరిస్థితుల కారణంగా 2026లో భారత కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంచనాను జీడీపీలో 0.25% మేర తగ్గించి.. 0.8% కి పరిమితం చేసింది సంస్థ. ఇక రూపాయి విషయానికొస్తే.. గత వారంలో అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో భారత రూపాయి అత్యుత్తమ పనితీరు కనబరిచినప్పటికీ.. మున్ముందు రూపాయి విలువలో భారీ పెరుగుదల ఉండకపోవచ్చని నివేదిక స్పష్టం చేసింది. విదేశీ పెట్టుబడులు పెరిగినప్పటికీ, ఆర్‌బీఐ తన ఫారెక్స్ నిల్వలను పెంచుకునేందుకు డాలర్లను కొనుగోలు చేసే అవకాశం ఉండటమే దీనికి కారణం.

ద్రవ్య విధానం విషయానికి వస్తే.. వడ్డీ రేట్ల తగ్గింపు ప్రక్రియ దాదాపు ముగిసినట్లేనని గోల్డ్‌మన్ సాక్స్ అభిప్రాయపడింది. దీని ప్రకారం 2026 పొడవునా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన రెపో రేటును 5.25% వద్దే యథాతథంగా ఉంచుతుందని అంచనా వేసింది. మొత్తం మీద భారత్-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాలు భారత ఆర్థికాభివృద్ధికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయని స్పష్టమవుతోంది.