సాధారణంగా ఇంట్లో మనం ఉదయం పూట మంచిగా తినాలి అని అంటుంటారు. కానీ చాలామంది భారతీయులు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి.. ఇలా మూడు పూటలా కడుపు నిండా, పుష్కలంగా తినేస్తున్నారని, అదే మన ఆరోగ్యానికి పెద్ద ముప్పుగా మారుతోందని ప్రముఖ ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మనం ఇంట్లో వండిన భోజనమే కదా, ఆరోగ్యనికి మంచిదే అని అనుకుంటాం.... కానీ అందులో ఎన్ని కేలరీలు ఉన్నాయో లెక్కలతో సహా వివరిస్తున్నారు. ఉదయం తినే టిఫిన్లో వెన్న వేసిన రెండు మూడు ఆలూ పరాఠాలు, టీ కలిపి సుమారు 700–800 కేలరీలు ఉంటాయట. మధ్యాహ్న భోజనానికి నాలుగు చపాతీలు, అన్నం, పప్పు, కూర, అప్పడం వీటితో సుమారు 800 కేలరీలు చేరుతాయట. సాయంత్రం స్నాక్స్ కి టీతో పాటు ఒక బిస్కెట్ ప్యాకెట్ లేదా నమ్కీన్ తింటే మరో 700–800 కేలరీలు, రాత్రి భోజనం కూడా మధ్యాహ్నం లాగే చేస్తే మరో 800 కేలరీలు దీనితో పాటు పడుకునే ముందు ఏదైనా స్వీట్లు లేదా స్నాక్స్ తింటే అవోక సుమారు 600–800 కేలరీలు మన శరీరంలోకి చేరుతాయట.
ఇవన్నీ కలిపితే మనం రోజుకు దాదాపు 4,000 కేలరీలు తీసుకుంటున్నాం. కానీ నిజానికి ఒక సాధారణ మనిషికి రోజుకు 1,800 నుండి 2,500 కేలరీలు మాత్రమే అవసరం. సిఫార్సు ప్రకారం చాలా మంది పురుషులకు, మంచి ఆరోగ్యం కోసం ప్రతిరోజు తీసుకోవాల్సిన కేలరీల దాదాపు 2,000–2,500 కేలరీలు, అలాగే చాలా మంది మహిళలకు 1,800–2,200 కేలరీలు.
మనం అవసరానికి మించి సుమారు 1,500 కేలరీలు అదనంగా తింటున్నాం. దానికి తగ్గట్టుగా శారీరక శ్రమ లేదా వ్యాయామం లేకపోవడంతో అదనపు కేలరీలన్నీ కరిగిపోకుండా శరీరంలో కొవ్వుగా పేరుకుపోతున్నాయి. ఇలా తినడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరిగిపోతాయి, జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది, ఊబకాయం, షుగర్, ఫ్యాటీ లివర్, గుండె జబ్బులు ఇంకా కీళ్ల నొప్పులు వచ్చే ప్రమాదం పెంచుతుంది.
ఆకలితో ఉండమని ;లేదా ఆకలిని తగ్గించుకోవాలి అని చెప్పడం లేదు, కానీ తినే పద్ధతిని మార్చుకోమంటున్నారు నిపుణులు. అందుకే మనం తినే ఆహారం ఏదైనా కార్బోహైడ్రేట్లు తగ్గించి ప్రోటీన్ ఉండేలా చూసుకోండి. అన్నం, చపాతీలు, రోటీలు మోతాదులో తినేలా చూసుకోవాలి.
బిస్కెట్లు, నమ్కీన్‌లు కాకుండా పండ్లు లేదా డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. రాత్రి భోజనాన్ని వీలైనంత త్వరగా, అది కూడా మీకు సరిపడేంతనే తీసుకోండి. రోజూ కాసేపు వ్యాయామం లేదా తిన్నాక నడక తప్పనిసరి పెట్టుకోండి. ఇంటి భోజనమే కదా అని అతిగా తినకుండా.. మీరు ఆరోగ్యంగా, ఎక్కువ కాలం జీవించాలంటే.. ఆకలి తీరేలా తినండి కానీ, అతిగా మోతాదుకు మించి హద్దులు దాటి తినకండి అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
