ఇంటికో కేజీ చికెన్, మటన్.. ప్రచారానికి మిగిలింది ఒక్కరోజే

ఇంటికో కేజీ చికెన్, మటన్.. ప్రచారానికి మిగిలింది ఒక్కరోజే

నల్గొండ, వెలుగు: మున్సిపల్ ఎన్నికలకు ప్రచారం ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉండడంతో అభ్యర్థులు  పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎక్కడా ఖర్చుకు వెనుకాడటం లేదు. ఎక్కడ పది మంది కనిపించినా వారికి దావత్​లు ఇస్తామని హామీ ఇస్తున్నారు. కోడి కూరతో భోజనం, అలవాటు ఉన్నవారికి మందు సర్దుతున్నారు.  రోజూ ఎంత మంది ఓటర్లకు, ఎంత పంపిణీ చేయాలో ఎన్నికల్లో నిల్చునే అభ్యర్థులు లెక్కలేసుకుంటున్నారు.  ఆదివారం కావడంతో మున్సిపాలిటీల్లో కోళ్లు, మేకలు భారీగా తెగిపడ్డాయి. మున్సిపాలిటీలలో అభ్యర్థులు ఇంటింటికీ కేజీ మాంసం, చికెన్  పంపిణీ చేసేందుకు పోటీ పడ్డారు.

సూర్యాపేట మున్సిపాలిటీలో కొంతమంది చికెన్ పంపిణీ చేయగా మరికొంతమంది ఒక అడుగు ముందుకు వేసి కొన్ని వార్డుల్లో మటన్ పంపిణీ చేశారు.  సూర్యాపేటలో ఒక వార్డులో టన్ను చికెన్ పంపిణీ చేయగా మరో అభ్యర్థి 600 కేజీల మటన్ పంపిణీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఒక్క రోజే గడువు ఉండడంతో అభ్యర్థులు ప్రలోభాలకు తెర లేపరు. ఇప్పటికే వలస ఓటర్లను తిరిగి రప్పించే ప్రయత్నాలు చేస్తుండగా ఓటు రూ.2 వేల వరకు ఇస్తున్నట్లు సమాచారం.

యాదాద్రి, వెలుగు: మున్సిపాలిటీ ఎన్నికల్లో చివరి సండే సందడిగా మారింది.  కొందరు అభ్యర్థులు తమ శక్తి కొద్ది ఓటర్లకు తాగడానికి లిక్కర్, వండుకోవడానికి కుక్కర్లు​పంపిణీ చేశారు. యాదాద్రి జిల్లాలో టికెట్​కన్ఫామ్​ కాగానే ప్రతి రోజు జనాలతో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ డబ్బును మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారు. కొందరు అభ్యర్థులు ఓటర్ల సంఖ్యను బట్టి ఒక్కో ఇంటికి 25 కిలోల నుంచి 50 కిలోల బియ్యం వరకూ పంపిణీ చేశారు.

అయితే నేరుగా బియ్యం ఇవ్వకుండా కూపన్లు ఇచ్చి షాపుల వద్ద తీసుకోమని సూచించారు. దీంతో అభ్యర్థులు ఓటర్లను మరింత ఆకట్టుకోవడానికి ఆదివారం పంపిణీ చేపట్టారు. భువనగిరి మున్సిపాలిటీలో ఓ అభ్యర్థి ఇంటికి కిలో పచ్చాపలు (చేపలు) పంపిణీ చేశారు. చౌటుప్పల్​ మున్సిపాలిటీలో ఇంటికి కిలో చికెన్​ పంపిణీ చేశారు.  ఆలేరులో ఓ అభ్యర్థి పప్పు కుక్కర్లు పంపిణీ చేశారు. మరికొందరు కౌసుతో పాటు లిక్కర్​ కూడా పంపిణీ చేశారు.