ముంబై: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచులో నేపాల్ వీరోచిత పోరాటం కనబర్చింది. దాదాపు మ్యాచ్ గెలిచినంతా పని చేసి ఇంగ్లీష్ జట్టును వణికించింది. దుర్బేద్యమైన ఇంగ్లాండ్ బౌలింగ్‌ను ఎదుర్కొని 185 పరుగుల భారీ లక్ష్యానికి 4 నాలుగు పరుగుల దూరంలో నిలిచి ఓటమి పాలైంది నేపాల్. మ్యాచ్ ఓడిపోయినప్పటికీ నేపాల్ పోరాట పటిమ సగటు క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంది.
ఏకపక్షంగా సాగుతుందనుకున్నా మ్యాచును నేపాల్ చివరి బంతి వరకు తీసుకెళ్లి క్రికెట్ ప్రియులకు మంచి మజా అందించింది. విజయం కోసం నేపాల్ శాయశక్తులా శ్రమించిన తీరును ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ కూడా ప్రశంసించాడు.
మ్యాచ్ అనంతరం ప్రెజెంటేషన్‌లో బ్రూక్ మాట్లాడుతూ.. ‘‘నేపాల్‌పై గెలుపు అంత సులభం కాదు. అదృష్టవశాత్తూ మేం గెలిచాం. నేపాల్ చాలా బాగా ఆడింది. తమ స్టార్ స్పిన్నర్ ఆదిల్ రషీద్‌ను ఎదుర్కొవడానికి ఇతర జట్లు ఇబ్బంది పడతాయి. కానీ వారు సునాయసంగా అతడిని ఫేస్ చేశారు.
అద్భుతమైన ఆటతో నేపాల్ మమ్మల్ని క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టింది. మేం చాలా మంచి స్కోరే చేశాం. కానీ నేపాల్ అంత దగ్గరికి వస్తుందనుకోలేదు. టోర్నీలో మిగిలిన జర్నీకి ఆ జట్టుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’’ అని పేర్కొన్నాడు. పసికూన అనుకున్న నేపాల్ మమ్మల్ని వణికించిందని బ్రూక్ పరోక్షంగా ఒప్పుకున్నాడు.
