నల్గొండ మేయర్ పీఠం బీజేపీదే : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

నల్గొండ మేయర్ పీఠం బీజేపీదే : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

నల్గొండ అర్బన్, కోదాడ/ వెలుగు:  దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ  నాయకత్వానికి ప్రజల మద్దతు పెరుగుతోందని, ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు పిలుపునిచ్చారు. నల్లగొండ, కోదాడ పట్టణాల్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచార సభల్లో ఆయన మాట్లాడుతూ, నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌లో తొలి మేయర్ బీజేపీదేనని, మున్సిపల్ కోటపై కాషాయ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు అవినీతి, మత రాజకీయాలతో రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని విమర్శించారు.

కేంద్రం నుంచి వచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఆరోపిస్తూ, బీజేపీకి అవకాశం ఇస్తే నేరుగా కేంద్ర సహకారంతో పట్టణాల అభివృద్ధి చేస్తామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కాలేదని, అభివృద్ధి కనిపించడం లేదని ఆరోపించారు. బీజేపీ గెలిస్తే అవినీతి రహిత పాలన అందిస్తామని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని, బీసీలకు నష్టం చేస్తున్న కాంగ్రెస్ విధానాలను ప్రజలు గుర్తించాలని పిలుపునిచ్చారు. కమలం గుర్తుకు ఓటు వేసి బీజేపీ అభ్యర్థులను గెలిపించి డబుల్ ఇంజన్ ప్రభుత్వానికి బలం చేకూర్చాలని కోరారు.