సూర్యాపేట, వెలుగు: సమిష్టి కృషితో సూర్యాపేట మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి అత్యధిక నిధులు తీసుకొస్తామని రాష్ట్ర ఇరిగేషన్, సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆదివారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల నుంచి బైక్ ర్యాలీ నిర్వహించి గాంధీ విగ్రహం వద్ద కార్నర్ మీటింగ్‌లో మాట్లాడారు. సూర్యాపేట నాయకులు ఐక్యంగా పనిచేయడం శుభసూచకమని, టికెట్ల పంచాయతీ లేకుండా ఎన్నికల బరిలో ఉన్నట్లు తెలిపారు.
మున్సిపాలిటీలోని 48 వార్డులన్నింటినీ గెలిపించి రోడ్లు, డ్రైనేజీ, విద్య, వైద్యం, విద్యుత్ సదుపాయాలతో పట్టణాన్ని అభివృద్ధి చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా మంత్రిగా ఎస్సారెస్పీ రెండో దశ ఆధునీకరణతో పాటు దేవాదుల ప్యాకేజీ ద్వారా గోదావరి జలాలను తుంగతుర్తి ప్రాంతానికి అందిస్తామని పేర్కొన్నారు.
