ఇరాన్ దేశపు సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ దశాబ్దాలుగా పాటిస్తున్న ఒక ఆచారాన్ని ఈ ఏడాది పక్కన పెట్టారు. 37 ఏళ్లలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. ప్రతి ఏటా ఫిబ్రవరి 8న ఇరాన్ వైమానిక దళ కమాండర్లతో ఖమేనీ సమావేశం అవుతారు. 1989లో ఆయన పదవిలోకి వచ్చినప్పటి నుండి, కరోనా సమయంలో కూడా ఈ మీటింగ్‌కి ఆయన మిస్ అవ్వలేదు. కానీ ఈ ఏడాది సమావేశానికి ఆయన హాజరు కాలేదు. ఆయనకు బదులుగా ఆర్మీ చీఫ్ అబ్దుల్ రహీం మౌసావి అధికారులను కలిశారు.
1979లో ఇరాన్ విప్లవం జరుగుతున్నప్పుడు, సరిగ్గా ఇదే రోజున వైమానిక దళం అప్పటి రాచరిక వ్యవస్థను ఎదిరించి విప్లవ నేతలకు మద్దతు ప్రకటించింది. అప్పటి నుండి ఈ రోజును దేశ నాయకత్వం పట్ల సైన్యానికి ఉన్న విధేయతకు ప్రతీకగా జరుపుకుంటారు. ప్రస్తుతం ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తార స్థాయికి చేరాయి. గల్ఫ్ ప్రాంతంలో అమెరికా సైనిక శక్తిని భారీగా పెంచుతోంది. విమాన నౌకలు, అధునాతన డ్రోన్లు, యుద్ధ విమానాలను అమెరికా మోహరించడంతో ఇరాన్ అప్రమత్తమైంది.
అమెరికా ఎప్పుడైనా దాడి చేయవచ్చనే ఆందోళనల మధ్య, దేశ అత్యున్నత నాయకుడి భద్రత దృష్ట్యా ఆయన బయట జరిగే కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. అణు కార్యక్రమం, క్షిపణి సామర్థ్యాల విషయంలో ఇరాన్, అమెరికాల మధ్య చర్చలు ఆగిపోయాయి. రెండు దేశాలు ఒకరినొకరు హెచ్చరించుకుంటున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
దశాబ్దాల అలవాటును పక్కన పెట్టి ఖమేనీ కనిపించకపోవడం వెనుక ఆయన ఆరోగ్య కారణాలు ఉన్నాయా లేక అమెరికా దాడి చేస్తుందనే భయంతో రహస్యంగా ఉంటున్నారా అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో ఈ మార్పు చాలా కీలకంగా మారింది.
