ఒక్క రాంగ్ మెసేజ్ జీవితాన్నే తలకిందులు చేసింది.. రూ.70 లక్షలు కోల్పోయిన బెంగళూరీ

ఒక్క రాంగ్ మెసేజ్ జీవితాన్నే తలకిందులు చేసింది.. రూ.70 లక్షలు కోల్పోయిన బెంగళూరీ

ఆధునిక కాలంలో సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త ఎత్తుగడలతో అమాయకులను దోచుకుంటున్నారు. ముఖ్యంగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయనే ఆశ చూపి 'బిట్ కాయిన్' పేరుతో నిలువునా ముంచేస్తున్నారు. బెంగళూరుకు చెందిన ఒక ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ఉద్యోగి ఇటీవల ఇలాంటి ఒక భారీ మోసానికి గురై ఏకంగా రూ. 70 లక్షలు పోగొట్టుకున్నారు. టెలిగ్రామ్ యాప్‌లో వచ్చిన ఒకే ఒక్క మెసేజ్ అతని జీవితాన్నే తలకిందులు చేసింది.

అయితే ఇదంతా స్టార్ట్ అయ్యింది ఒక చిన్న పొరపాటుతోనే. 50 ఏళ్ల బాధితుడికి 2025 నవంబర్ 30న ప్రియా అగర్వాల్ అనే మహిళ నుంచి టెలిగ్రామ్ మెసేజ్ వచ్చింది. తాను వేరే ఎవరికో మెసేజ్ చేయబోయి పొరపాటున ఇతనికి పంపానని ఆమె నమ్మబలికింది. అక్కడితో ఆ చాటింగ్ ఆపకుండా.. వారు ప్రతిరోజూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆ సంభాషణ వాట్సాప్‌కు మారింది. బ్రిటన్ నెంబర్ వాడుతున్న ఆమె.. తాను లివర్‌పూల్‌లో ఉంటున్నానని, ఫ్యామిలీ బిజినెస్ నడుపుతున్నానని చెప్పి బాధితుడిని నమ్మించింది.

మెల్లగా గేమ్ స్టార్ట్ చేసిన సదరు మహిళ.. గత నాలుగేళ్లుగా బిట్ కాయిన్ ట్రేడింగ్‌లో కోట్ల రూపాయలు సంపాదించానని, మీరు కూడా ఇన్వె్స్ట్ చేయండి అంటూ బాధితుడిని కోరింది. ఆమె మాటలు నమ్మి.. ఆమె పంపిన ఒక నకిలీ ట్రేడింగ్ లింక్ ద్వారా బాధితుడు ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేశాడు. మొదట 50 వేల రూపాయలతో మొదలుపెట్టి.. 2025 డిసెంబర్ నుండి 2026 జనవరి 14 మధ్య మొత్తం 8 విడతల్లో రూ.70 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఈ మొత్తం కోసం అతను తన సేవింగ్స్ డబ్బును మాత్రమే కాకుండా.. బ్యాంకుల నుండి భారీగా అప్పులు కూడా చేశాడు.

ఆ నకిలీ వెబ్‌సైట్ డాష్‌బోర్డ్‌లో అతనికి పెట్టుబడిపై దాదాపు రూ.2.6 కోట్ల లాభం వచ్చినట్లు కనిపిస్తుండటంతో అది నిజమని నమ్మాడు. తీరా ఆ డబ్బును విత్‌డ్రా చేయాలని చూసినప్పుడు అసలు విషయం బయటపడింది. అతని ఖాతాను ఫ్రీజ్ చేసిన సైబర్ నేరగాళ్లు.. ఆ డబ్బును విడుదల చేయాలంటే టాక్స్, ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో మరికొంత డబ్బు కట్టాలని డిమాండ్ చేశారు. అప్పుడు కానీ తాను మోసపోయానని బాధితుడు గ్రహించలేదు. వెంటనే అతను నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేశాడు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్‌లకు స్పందించవద్దని, అధిక లాభాల ఆశ చూపే స్కీమ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఎన్నిసార్లు మెుత్తుకుంటున్నా మోసపోయేవాళ్లకు మాత్రం అవి అస్సలు వినిపించటం లేదు.