
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’. మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. శనివారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి అంబికా కృష్ణ కెమెరా స్విచాన్ చేయగా.. వసుధ ఫౌండేషన్ ఛైర్మన్ మంతెన వెంకట రామరాజు క్లాప్ కొట్టారు. మధుర శ్రీధర్ రెడ్డి ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ
‘మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమిది. వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి మధ్య కథ జరుగుతుంది. కొత్తగా పెళ్లైన జంట ఎదుర్కొనే ఓ సమస్యను వినోదాత్మకంగా తెరకెక్కిస్తున్నాం’ అని చెప్పాడు. జూన్ 8 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడుతున్నామని నిర్మాత అన్నారు.
వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ రాజా, ఏక్ మినీ కథ లాంటి చిత్రాలకు స్క్రీన్ప్లే అందించిన రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ప్లే రాస్తున్నారు. వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, తాగుబోతు రమేష్, రచ్చ రవి ఇతర పాత్రలు పోషిస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నాడు.