2 వేల 260 వైన్స్ కోసం లక్షా 31వేల దరఖాస్తులు

2 వేల 260 వైన్స్ కోసం లక్షా 31వేల దరఖాస్తులు
  • 2,260 వైన్స్ కోసం లక్షా 31వేల దరఖాస్తులు
  • రాష్ట్ర ఖజానాలో రూ.2,629 కోట్లు జమ
  • రేపు లక్కీ డ్రా తీయనున్న అధికారులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,260 వైన్స్ కోసం మొత్తం లక్షా 31వేల 490 టెండర్ అప్లికేషన్లు వచ్చాయి. 15 రోజుల వ్యవధిలోనే ప్రభుత్వ ఖజానాలో రూ.2,629 కోట్లు జమ అయ్యాయి. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో టెండర్ అప్లికేషన్లు రాలేదు. రెండేండ్ల కిందటితో పోలిస్తే దరఖాస్తులు రెట్టింపు స్థాయిలో వచ్చాయి. ఒక్కో మద్యం దుకాణానికి యావరేజ్​గా 50 మంది చొప్పున పోటీపడుతున్నారు. 


 వాస్తవానికి ప్రభుత్వం ఊహించిన దానికంటే ఎక్కువే అప్లికేషన్లు రావడంతో భారీగా ఆదాయం సమకూరింది. సోమవారం లక్కీ డ్రా తీయనున్నారు. ఆ తర్వాత 22వ తేదీన లైసెన్స్ ఫీజులో మొదటి ఇన్​స్టాల్​మెంట్​ను వైన్స్​దక్కించుకున్నోళ్లు ప్రభుత్వానికి కట్టాల్సి ఉంటుంది. దీంతో కూడా ప్రభుత్వానికి దాదాపు రూ.300 కోట్ల మేర ఆదాయం రానుంది. ఇలా కేవలం వైన్స్​ టెండర్లతోనే ప్రభుత్వం మూడు వేల కోట్ల రూపాయాల దాకా అర్జిస్తున్నది. 

రెండు చోట్ల 10 వేలు దాటిన అప్లికేషన్లు


వైన్స్​లకు అత్యధికంగా అప్లికేషన్లు వచ్చిన దాంట్లో సరూర్ నగర్ మొదటి ప్లేస్​లో ఉన్నది. ఇక్కడ ఏకంగా 10,908 అప్లికేషన్లు వచ్చాయి. ఆ తర్వాత స్థానంలో శంషాబాద్​కు 10,811 దరఖాస్తులు వచ్చాయి. ఏపీ బార్డర్లుగా ఉన్న ఖమ్మంలో 7,207, నల్లగొండలో 7,058 అప్లికేషన్లు రాగా.. మేడ్చల్​లో 7,017 దరఖాస్తులు వచ్చాయి.కేవలం ఈ ఐదు ప్రాంతాలు కలిపితేనే 36 వేల అప్లికేషన్లు అవుతున్నాయి. తక్కువ అప్లికేషన్లు ఆసిఫాబాద్​లో 967, ఆదిలాబాద్ లో 979, గద్వాలలలో 1179 వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది.