అది ఎన్​కౌంటర్ కాదు.. ​ఊచకోతే

అది ఎన్​కౌంటర్ కాదు.. ​ఊచకోతే
  • ఏడేండ్ల కిందటి మారణకాండ
  • మావోయిస్టుల పేరిట 17 మంది ఆదివాసీల కాల్చివేత
  • 12 ఏళ్ల బాలిక సహా ఆరుగురు మైనర్ల హత్య
  • విత్తనాల పండుగ కోసం వచ్చి బలైన అమాయకులు
  • చత్తీస్‍గఢ్  దండకారణ్యంలో భద్రతబలగాల నిర్వాకం
  • నక్సల్స్‌‌గా నమ్మించేందుకు అన్ని ప్రయత్నాలు
  • జస్టిస్ వీకే అగర్వాల్​ కమిషన్​ రిపోర్ట్‌‌ లీక్‍తో వెలుగులోకి..

భద్రాచలం, వెలుగు:

ఏడేళ్ల కింద దండకారణ్యంలో జరిగిన ఓ ఎన్​కౌంటర్‌‌లో భద్రతాబలగాలు.. మావోయిస్టులు అనుకొని 17మంది అమాయక ఆదివాసీలను ఊచకోత కోసినట్లు తాజాగా వెలుగులోకొచ్చింది. 2012 జూన్‍28 రాత్రి విత్తనాల పండుగ ఏర్పాట్లలో ఉన్న అమాయక గిరిజనులను ఏకపక్షంగా కాల్చి చంపడమేగాక వాళ్లు మావోయిస్టులే అని నమ్మించేందుకు సీఆర్‍పీఎఫ్, కోబ్రా దళాలు అన్ని రకాలుగా ప్రయత్నించాయి. అప్పట్లో యావత్ దేశాన్ని కుదిపేసిన ఈ ఘటనలో నిజానిజాల నిగ్గు తేల్చేందుకు జస్టిస్ వీకే అగర్వాల్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన జ్యుడిషియల్‌‌ కమిషన్‍ తాజాగా చత్తీస్‌‌గఢ్​ ప్రభుత్వానికి సమర్పించిన రిపోర్ట్‌‌ లీకైంది. నాడు భద్రతాబలగాలు కాల్చిచంపింది మావోయిస్టులను కాదనీ, అమాయక ఆదివాసులనని తేలడం అంతటా కలకలం రేపుతోంది.

మృతుల్లో 12 ఏళ్ల బాలిక..

2012 జూన్‍ 28 వ తేదీన రాత్రి విత్తనాల పండుగ(బీజా పండుం) ఎప్పుడు జరపాలో నిర్ణయించేందుకు ఆదివాసీలు సమావేశమయ్యారు. చత్తీస్‍గఢ్‌‌.. బీజాపూర్‍ జిల్లా సర్కెగూడా, కొత్తగూడా, రాజపెంట గ్రామాలకు చెందిన ఆదివాసీలు సర్కెగూడ -కొత్తగూడల మధ్యనున్న ఓ ఖాళీ ప్రదేశంలో కూర్చున్నారు. సమావేశం జరుగుతుండగా 100 మంది సీఆర్‍పీఎఫ్​ సిబ్బంది, కోబ్రా కమెండోలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఎలాంటి హెచ్చరికా లేకుండా సమావేశంపై ఏకపక్షంగా కాల్పులు జరపడంతో 17 మంది ఆదివాసీలు అక్కడికక్కడే చనిపోయారు.

మృతుల్లో  12 ఏండ్ల బాలిక సహా ఆరుగురు మైనర్లు కూడా ఉండడంతో అంతర్జాతీయ సమాజానికి అనుమానం వచ్చింది. ఆదివాసీల రోదనలు విని క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లి విచారిస్తే అసలు వారు మావోయిస్టులు కానే కాదని, మూడు గ్రామాల ఆదివాసీల సమావేశంపై భద్రతా బలగాలు దాష్టీకానికి పాల్పడ్డాయని ప్రజాహక్కుల సంఘాలు తేల్చి చెప్పాయి. దీనిపై తీవ్ర ఒత్తిడి రావడంతో నాటి సీఎం రమణ్‍సింగ్ ఆధ్వర్యంలోని చత్తీస్‍గఢ్ సర్కారు జస్టిస్‍ వీకే అగర్వాల్‌‌ నేతృత్వంలో జ్యుడిషియల్‌‌ కమిషన్‌‌ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్‌‌ అనేక కోణాల్లో విచారణ జరిపి ఇటీవలే చత్తీస్‍గఢ్‌‌ ప్రభుత్వానికి రిపోర్ట్‌‌ ఇచ్చింది. అయితే ఈ నివేదిక కాస్త ఇప్పుడు లీకైంది. మావోయిస్టులతో కలిసి గ్రామస్థులు తమపై కాల్పులు జరిపారని నాడు భద్రతాబలగాలు వాదించాయి. కానీ గ్రామస్థులు సిబ్బందిపై ఎలాంటి కాల్పులు జరపలేదని జ్యుడిషియల్‌‌ దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఘటనాస్థలంలో ఉన్న డీఐజీ ఎస్‌‌ ఎలాంగో, మీటింగ్‌‌ నుంచి ఎటువంటి కాల్పులు జరగలేదని స్వయంగా విచారణలో అంగీకరించినట్లు రిపోర్ట్‌‌లో తెలుస్తోంది. ఈ రిపోర్ట్‌‌ ప్రస్తుత చత్తీస్‍గఢ్‌‌లోని కాంగ్రెస్​ సర్కారుకు చేరింది. భద్రతా సిబ్బంది పొరపాటుగా, ఈ కాల్పులు జరిపినట్లు తేటతెల్లమైంది. వారు మావోయిస్టులు అని చెప్పేందుకు తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని కూడా భద్రతాసిబ్బంది పేర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ రిపోర్ట్‌‌ లీక్‌‌ కావడంతో రాజకీయ దుమారం రేగుతోంది.

మృతులు..మూడు గ్రామాల ఆదివాసీలు

విత్తనాల పండుగ కోసం నిర్వహిస్తున్న సమావేశంపై బలగాలు కాల్పులు జరిపాయి.  కొత్తగూడ, రాజుపెంట, సర్కెగూడ గ్రామాలకు చెందిన ఆదివాసీలు చనిపోయారు. నాటి మృతుల్లో కొత్తగూడాకు చెందిన కాక సరస్వతి(12), కాక సమ్మయ్య(32), కాక రాహుల్‍(16), మడ్కం రామ్‍విలాస్‍(16), మడ్కం దిలీప్‍(17), ఇర్పా రమేశ్​(30), ఇర్పా దినేశ్​(25), మడ్కం నగేశ్‌‌(35), మడ్కం సురేశ్‌‌(30), ఇర్పా నారాయణ(45), రాజుపెంట వాసులు ఇర్పా ధర్మయ్య(40), ఇర్పా సురేశ్‌‌(15), సర్కెగూడె వాసులు సర్కె రామన్న(25), ఆప్కా మీతూ(16), కొర్సా బిచ్చెం(22), కుంజం మల్ల(25) మాడ్వి ఐతు(40) తదితరులు ఉన్నారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాక రమేశ్, కాక పార్వతి, ఇర్పా చిన్నక్క, ఆబ్కా చోటును బీజాపూర్‍, జగదల్‍పూర్​ ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందించారు. మడకం సోమయ్య, కాకా సెంటిని రాయ్‍పూర్‍ ఆసుపత్రిలో చేర్చారు. ఆ రోజు రాత్రి మృతదేహాలను 25 మంది గ్రామస్థులను సమీప బసగూడ పోలీస్‍స్టేషన్‍కు సీఆర్‍పీఎఫ్‍ జవాన్లు తీసుకెళ్లారు. తెల్లారి గ్రామస్థులను విడిచిపెట్టగా వారంతా వెళ్లి పోలీస్‍స్టేషన్‍ ఎదుట ధర్నా చేశారు. దీంతో అనేక మంది ఆదివాసీలను చితకబాదారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఘటనను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించినా కుదరలేదు. ఎట్టకేలకు ప్రభుత్వం జస్టిస్‌‌ వీకే అగర్వాల్‌‌ నేతృత్వంలో కమిషన్‌‌ వేయక తప్పలేదు. ఏడేళ్ల తర్వాత ఊచకోత ఉదంతం వెలుగులోకి వచ్చింది.

17 Adivasis killed by police in the name of Maoists 7 years ago in chhattisgarh