
రాష్ట్ర బీజేపీ ఎమ్మె్ల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మే 18వ తేదీ శనివారం బీజేపీ శాసనసభా పక్ష ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యేలు పైడి రాకేష్ రెడ్డి, రామారావు పటేల్‌తో కలిసి సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలు పరిష్కరించాలని, వరికి క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాలని సీఎం రేవంత్ ను కోరారు. అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు బీజేపీ నేతలు.
కాగా.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ సర్కార్ కూలిపోతుందంటూ బీజేపీ అగ్రనేతలు పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఏమైనా జరగొచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడంపై ఆసక్తి నెలకొంది. అయితే, సీఎంతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి.. ధాన్యం కొనుగోలు, నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కారించాలని సీఎం కోరామని.. అంతే తప్ప, ఇందులో మరోకటి లేదని స్పష్టం చేశారు.