ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర : ఎమ్మెల్యేలు యెన్నం, జీఎంఆర్

ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర : ఎమ్మెల్యేలు యెన్నం, జీఎంఆర్

మహబూబ్​నగర్​ అర్బన్​, వెలుగు: జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం  చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని మహబూబ్​నగర్, దేవకరద్ర ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్​ రెడ్డి, జి. మధుసూదన్​ రెడ్డి విమర్శించారు.  ఏఐసీసీ పిలుపు మేరకు ఆదివారం మహబూబ్‌‌‌‌నగర్ నగరంలోని అశోక్ టాకీస్ చౌరస్తాలో పాలమూరు డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ అధ్యక్షత నిరసన కార్యక్రామన్ని చేపట్టారు. 

ఈ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మైనార్టీ కార్పొరేషన్​ చైర్మన్​ ఒబేదుల్లా కొత్వాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి, అధికార ప్రతినిధి జహీర్ అక్తర్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్​ ఖాద్రి, ఎన్పీ వెంకటేశ్​, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ పాల్గొన్నారు. 

మహిళా సంఘ భవనాన్ని పూర్తి చేయాలి

మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు: మహిళల సాధికారతకు మౌలిక సదుపాయాలు ఎంతో అవసరమని పాలమూరు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​ రెడ్డి అన్నారు.  మహబూబ్​నగర్ నగరంలోని ఎంప్లాయీస్ కాలనీలో  నూతనంగా నిర్మిస్తున్న మహిళా సంఘం భవనాన్ని ఆదివారం మధ్యాహ్నం ఆయన పరిశీలించారు.  ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని కాంట్రాక్టర్​ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలకు ఉపయోగపడే విధంగా ఈ భవనాన్ని అన్ని సౌకర్యాలతో నిర్మిస్తున్నామన్నారు. నిర్మాణ పనులు ఆలస్యం కాకుండా, నిర్ణీత సమయంలో  పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్​ను ఆదేశించారు.

గాంధీ చౌక్‌‌లో నిరసన

వనపర్తి, వెలుగు: యూపీఏ ప్రభుత్వం దేశంలోని గ్రామీణ పేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్న గొప్ప లక్ష్యంతో తీసుకొచ్చిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం నిర్వీర్యం చేస్తోందని స్పోర్ట్స్​ అథారిటీ చైర్మన్​, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి విమర్శించారు. ఏఐసీసీ పిలుపు మేరకు ఆదివారం జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్‌‌లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా దాదాపు 5 వేల కోట్ల పని దినాలను కల్పించిన ఏకైక పథకంగా చరిత్ర సృష్టించిందన్నారు. 

సుమారు 14 కోట్ల మంది కూలీలు ఈ పథకం కింద నమోదు చేసుకుని ఉపాధి పొందుతున్నారని, ఇప్పటివరకు  రూ. 11. 75 లక్షల కోట్లు  వేతనాలు నేరుగా కూలీల ఖాతాల్లో జమ అయ్యాయని వివరించారు. ఈ పథకం వల్ల దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో వలసలు తగ్గాయన్నారు. అలాంటి స్కీమును ఎత్తివేసేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌‌ శ్రీనివాస్​గౌడ్​, లీడర్లు శంకర్ ప్రసాద్,  పీసీసీ కార్యదర్శులు, పార్టీ, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.