బెంగళూర్: ఐపీఎల్-2026 సీజన్ ప్రారంభానికి వారం రోజుల ముందే ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ఇంట్లో ఆనందం వెల్లివెరిసింది. రజత్ పాటిదార్ తండ్రి అయ్యాడు. గురువారం (మార్చి 19) పాటిదార్ దంపతులు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తను ఆర్సీబీ కెప్టెన్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ఈ శుభ సందర్భంగా పలువురు పాటిదార్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
మధ్యప్రదేశ్‌కు చెందిన రజత్ పాటిదార్ 2025లో ఆర్సీబీ కెప్టె్న్‌గా నియమితులైన సంగతి తెలిసిందే. 17 ఏళ్ల నిరీక్షణకు తెర దించుతూ 2025లో పాటిదార్ కెప్టెన్సీలో ఆర్సీబీ తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలిచింది. అనిల్ కుంబ్లే, విరాట్ కోహ్లీ, డుప్లెసిస్ వంటి హేమాహేమీల కెప్టెన్సీలోనే ఆర్సీబీ టైటిల్ నెగ్గలేకపోయింది.
కానీ కెప్టెన్సీ చేపట్టిన తొలి సీజన్లో ఆర్సీబీకి ఎన్నో ఏండ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ఐపీఎల్ టైటిల్‌ను అందించాడు పాటిదార్. విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ప్లేయర్లతో సూచనలు, సలహాలతో జట్టును అద్భుతంగా ముందుకు నడిపించాడు. దీంతో ఈ సీజన్లో కూడా కెప్టెన్సీ పగ్గాలను ఆర్సీబీ రజత్ పాటిదార్‌కే అప్పగించింది.
పాటిదార్ నాయకత్వంలో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆర్సీబీ ఈ సీజన్లో బరిలోకి దిగనుంది. 2026, మార్చి 28న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తమ సొంత గడ్డ చిన్నస్వామి స్టేడియం నుంచి టైటిల్ వేటను షూరు చేయనుంది ఆర్సీబీ.
