పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఇరాన్ సైనిక చరపై అమెరికా నిఘా విభాగం చీఫ్ తులసీ గబ్బార్డ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ విషయంలో అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యాలు వేర్వేరు ఉన్నాయని చెప్పారు. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థను, నౌకాదళాన్ని నాశనం చేయడమే అధ్యక్షుడు ట్రంప్ ప్రధాన లక్ష్యమని అన్నారు. అయితే ఇజ్రాయెల్ మాత్రం ప్రధానంగా ఇరాన్ నాయకత్వాన్ని దెబ్బతీయడంపై దృష్టి సారించినట్లు స్పష్టమవుతోందన్నారు అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్.
అమెరికా సెనెట్ హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీ విచారణలో ఆమె మాట్లాడుతూ.. అధ్యక్షుడు నిర్దేశించిన లక్ష్యాలు, ఇజ్రాయెల్ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల కంటే భిన్నంగా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రధానంగా ఇరాన్ నాయకత్వాన్ని దెబ్బతీయడంపై దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది. అయితే ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ సామర్థ్యం, క్షిపణి ఉత్పత్తి సామర్థ్యం ,నౌకాదళాన్ని తుడిచిపెట్టడమే తన లక్ష్యాలని అధ్యక్షుడు ట్రంప్ స్పష్టంగా చెప్పారని తులసీ గబ్బార్డ్ వివరించారు.
►ALSO READ | ఇరాన్, అమెరికా యుద్ధంలో కీలక మలుపు: హార్మూజ్ విముక్తికి రంగంలోకి యూరప్ దేశాలు
అంతకుముందు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ అంతకుముందు మాట్లాడుతూ.. ఇరాన్‌పై జరుగుతున్న యుద్దం ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేం.. అమెరికా నిర్దేశించుకున్న లక్ష్యాలు క్షిపణి వ్యవస్థల ధ్వంసం, నౌకాదళం నిర్వీర్యం పూర్తిగా నెరవేరే వరకు ఈ సైనిక చర్య కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. మేం అనుకున్నది కొంత సాధించాం.. యుద్దాన్ని ముగించే అంతిమన నిర్ణయం ట్రంప్ చేతిలో ఉందని ప్రకటించారు.
మరోవైపు ఇజ్రాయెల్ ఇరాన్ ఉన్నత స్థాయి నాయకత్వమే లక్ష్యంగా దాడులను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఎస్మాయిల్ ఖతీబ్ తో పాటు ఇతర కీలక భద్రతా అధికారులను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. దీనికి ప్రతికారంగా ఇరాన్, ఇజ్రాయెల్‌పై క్షిపణుల వర్షం కురిపించింది. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ (West Bank) లో జరిగిన ఈ దాడుల్లో ప్రాణనష్టం కూడా సంభవించినట్లు నివేదికలు చెబుతున్నాయి.
