టెహ్రాన్: అమెరికా-ఇరాన్ యుద్ధంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఇరాన్ చెర నుంచి ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ వంటిదైన స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ జల సంధికి విముక్తి కల్పించేందుకు రంగంలోకి దిగుతామని జపాన్‌తో పాటు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్ వంటి యూరప్ దేశాలు ప్రకటించాయి. హోర్ముజ్ జలసంధి గుండా నౌకల సురక్షిత ప్రయాణానికి సహాయం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని గురువారం (మార్చి 19) ఆయా దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. గల్ఫ్‌లోని చమురు ఉత్పత్తి, రవాణా కేంద్రాలపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించాయి.
హార్మూజ్ జల సంధిలో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ ఇంధన మార్కెట్లను స్థిరీకరించడానికి తాము సమన్వయ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నాయి. వాణిజ్య నౌకాయానానికి, ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పు కలిగించే దాడులను తక్షణమే నిలిపివేయాలని ఇరాన్‌ను కోరాయి. సంక్షోభం సమయంలో చమురు రవాణా మార్గాలను పరిరక్షించడానికి సన్నాహక ప్రణాళికలో నిమగ్నమైన దేశాల నిబద్ధతను కూడా ఆయా దేశాలు స్వాగతించాయి. హార్మూజ్ జల సంధి ఇష్యూలోకి యూరప్ దేశాల ఎంట్రీతో ఇరాన్ తీసుకునే చర్యలపై ఉత్కంఠ నెలకొంది. ఈ పరిణామంతో యుద్ధం ఎటు దారి తీస్తుందోనని ప్రపంచ దేశాల్లో భయాందోళనలు తీవ్రమయ్యాయి.
అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జల సంధిని ఇరాన్ బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. కాదు కూడదు అని ముందుకెళ్లే నౌకలపై ఇరాన్ దాడులు చేస్తోంది. ఇరాన్ దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు ఆటంకం ఏర్పడింది. కొన్ని దేశాల్లో ఇంధన సంక్షోభం తలెత్తింది. ఈ క్రమంలో ప్రపంచ దేశాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక పిలుపునిచ్చారు.
హార్మూజ్ జల సంధిలో చమురు నౌకలను కాపాడుకునేందుకు ఆయా దేశాలు తమ యుద్ధ నౌకలను పంపాలని పిలుపునిచ్చారు. హర్మూజ్ జల సంధిలో యుద్ధ నౌకలను మోహరించాలని కోరారు. ఇరాన్ నుంచి హార్మూజ్ జల సంధికి స్వేచ్ఛ కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అయితే.. ట్రంప్ పిలుపుకు ఆశించిన స్పందన రావడం లేదు.
హార్మూజ్ జల సంధిలో యుద్ధ నౌకలు మోహరించేందుకు చైనా నిర్ద్వందంగా తిరస్కరించింది. బ్రిటన్ కూడా ఇందుకు సముఖత వ్యక్తం చేయలేదు. యుద్ధం ఇప్పుడు ముగిస్తారో ముందు ట్రంప్ స్పష్టంగా చెప్పాలని యూరప్ కంట్రీస్ డిమాండ్ చేశాయి. ఇక, ఇండియా అయితే ఈ అంశంపై రెస్పాండే కాకపోవడం గమనార్హం. హార్మూజ్ జల సంధి విషయంలో తన పిలుపును పట్టించుకోని దేశాలపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో హార్మూజ్ జల సంధి రక్షణ కోసం యూరప్ దేశాలు ముందుకు రావడం గమనార్హం.
