నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : జిల్లాలోని కొండారెడ్డిపల్లిలో వివిధ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని నాగర్‌కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. పనులన్నీ నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
నూతనంగా మంజూరైన అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్ పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణానికి అవసరమైన 5 ఎకరాల భూమిని వెంటనే అప్పగించాలని వంగూరు తహసీల్దార్‌ను ఆదేశించారు. అలాగే, శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనం తొలగింపు ప్రక్రియను పూర్తి చేసి, వేసవి సెలవుల్లోగా నూతన భవన నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సూచించారు.
అంగన్‌వాడీ భవనం, బ్యాంక్ భవన ఆధునికీకరణ పనులను మరో రెండు నెలల్లో పూర్తి చేయాలన్నారు. అనంతరం తెల్కపల్లి మండల కేంద్రంలోని పీహెచ్‌సీని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. గౌరెడ్డిపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులకు పలు సూచనలు చేశారు.
