పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ డీపీఆర్..వాపస్ వచ్చిందే కేసీఆర్ హయాంలో

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ డీపీఆర్..వాపస్ వచ్చిందే  కేసీఆర్ హయాంలో

తెలంగాణ రాష్ట్రాన్ని పదేండ్లలో కేసీఆర్ సర్వనాశనం చేశారని.. ఆయనొక ఆర్థిక ఉగ్రవాది అని సీఎం రేవంత్​రెడ్డి మండిపడ్డారు. ‘‘తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన పాలమూరు జిల్లాకే అన్యాయం చేసిన జలద్రోహి కేసీఆర్. రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని నడిబజారులో నిలబెట్టి దివాలా తీయించిండు.  భూకంపం వచ్చి వెళ్లాక మిగిలిన శిథిలాల మాదిరిగా రాష్ట్రాన్ని మార్చితే.. మేం ఇప్పుడు ఆ శిథిలాలను తొలగిస్తూ రాష్ట్రాన్ని దారిలో పెడుతున్నాం” అని ఆయన తెలిపారు. 

డీపీఆర్​ వాపస్​ వచ్చిందే బీఆర్​ఎస్​ టైమ్​లో..!

తెలంగాణకు కేసీఆర్ చేసిన ద్రోహం ఎవరూ చేయలేదని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ‘‘పట్టిసీమ బాగా కట్టారని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబును అభినందించిందే కేసీఆర్​. అటు రాయలసీమకు, ఇటు కోస్తాంధ్ర శ్రీకాకుళానికి నీళ్లు తీసుకుపొమ్మని చెప్పిందే ఆయన. మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ జిల్లా రైతులకు మరణశాసనం రాసి, వలసలకు కారణమైంది కేసీఆరే. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్ వాపస్ వచ్చిందని అంటున్నారు.. వాళ్లు(బీఆర్​ఎస్​ హయాంలో) సరిగ్గా చేసి పంపకపోతే అప్పుడే (2023లో) వెనక్కి వచ్చింది. కృష్ణాలో 299 టీఎంసీలు చాలు అని చెప్పి, ఆ తర్వాత ట్రిబ్యునల్ లో 50:50 అని అడిగింది కూడా వాళ్లే. ఇదంతా నాడు చంద్రబాబు, జగన్​కు, కేసీఆర్ కు మధ్య ఒక కాంట్రాక్టర్ ద్వారా జరిగిన వ్యవహారం. ముందు దానికి సమాధానం చెప్పి, తెలంగాణ ప్రజల దగ్గరికి వచ్చి క్షమించాలని వేడుకోవాలి” అని కేసీఆర్​కు సీఎం సూచించారు. 

‘‘ఇప్పుడు మాట్లాడుతున్న 90 టీఎంసీలు అడిగింది కేసీఆరే.. మేం అడిగింది లేదు. 45 టీఎంసీలు ట్రిబ్యునల్ డిసైడ్ చేస్తుంది” అని తెలిపారు. పదేండ్లలో లిఫ్టులు, పంపులు, కాంట్రాక్టులు, కమీషన్ల కోసమే పనిచేశారని.. ఇరిగేషన్ కోసం రూ.2 లక్షల కోట్లు ఖర్చు పెడితే, అందులో రూ.1.80 లక్షల కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించారని సీఎం రేవంత్​ మండిపడ్డారు. ‘‘వాళ్లు వేల కోట్లు ఖర్చు పెట్టినా సగం ప్రాజెక్టులు కూడా పూర్తి చేయలేదు. ఉమ్మడి రాష్ట్రంలో వివక్ష చూపించారు.. పదేండ్లలోనూ అదే జరిగింది. కేసీఆర్ సంగంబండకు రూ.12 కోట్లు ఇవ్వకపోతే నేను వచ్చాక ఇచ్చి పూర్తి చేశా. కల్వకుర్తి భూసేకరణ పూర్తి చేశా. తట్టెడు మట్టి ఎత్తలేదని కేసీఆర్ అంటున్నడు.. పాలమూరులో వివిధ ప్రాజెక్టుల కోసం దాదాపు రూ.6500 కోట్లు ఖర్చు చేశాం.. రా జలద్రోహి చూపిస్త” అని సవాల్​ చేశారు. సొంత బిడ్డ కవితను పార్టీ నుంచి బయటపడేసింది కేసీఆర్​ కుటుంబమేనని, అవి వాళ్ల కుటుంబ వ్యవహారాలని, వాటి గురించి మాట్లాడదలుచుకోలేదని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు.