Barabar Premistha: చంద్రహాస్ లైవ్ సాంగ్ రచ్చ... ‘గుంజీ గుంజీ’ పాట వివాదంపై నిర్మాతల క్లారిటీ

Barabar Premistha: చంద్రహాస్ లైవ్ సాంగ్ రచ్చ... ‘గుంజీ గుంజీ’ పాట వివాదంపై నిర్మాతల క్లారిటీ

యాటిట్యూడ్ స్టార్ చంద్ర హాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ బరాబర్ ప్రేమిస్తా. రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం (ఫిబ్రవరి 6న) ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సినిమా విడుదలకు ముందే అనూహ్యంగా వివాదంలో చిక్కుకుంది. 

ఇటీవల నిర్వహించిన బరాబర్ ప్రేమిస్తా ఆడియో ఫంక్షన్‌లో హీరో చంద్ర హాస్ లైవ్‌లో పాడిన ‘గుంజీ గుంజీ’ పాట తీవ్ర వివాదాస్పదంగా మారింది. బూతు పదాలతో ఉన్న ఈ పాటను.. లైవ్లో చంద్ర హాస్ స్టేజీపై పాడటంతో ఇండస్ట్రీలో పెను దుమారం రేగింది.

ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తడమే కాకుండా, చంద్ర హాస్‌పై అధికారికంగా కంప్లైంట్ కూడా నమోదు అయింది. ఈ క్రమంలోనే బరాబర్ ప్రేమిస్తా సినిమా దర్శకుడు సంపత్ రుద్ర, నిర్మాతలు గెడా చందు, గాయత్రి చిన్ని తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

నిర్మాత గెడా చందు మాట్లాడుతూ, ‘‘సినిమాలో తన క్యారెక్టర్ జైషన్ చెప్పాలనే ఉద్దేశ్యంతోనే హీరో చంద్ర హాస్ ఆ పాట పాడాడు. అయితే, అనుకోకుండా పొరపాటు జరిగింది. ఆ సమయంలో ఈవెంట్‌లో ఉన్న ఎవరికీ దాని గురించి తెలియదు. అతడు కావాలని చేసింది కాదు. తర్వాత స్టేజ్ దిగిన వెంటనే అలా చేయకూడదని చంద్ర హాస్‌కు చెప్పాం. ఈ ఘటనపై మేము నిజంగా బాధపడుతున్నాం” అని నిర్మాత తెలిపారు.

అలాగే బరాబర్ ప్రేమిస్తా డైరెక్టర్ సంపత్ రుద్ర మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చాడు. ‘‘ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చంద్రహాస్‌ పాడిన పాటలో కొన్ని తప్పులు దొర్లాయి. చంద్రహాస్‌ అలా చేసినందుకు చాలా బాధగా ఉంది.. కానీ సినిమాలో అలాంటి పాటలు లేవు. బరాబర్ ప్రేమిస్తా సినిమా పూర్తిగా క్లీన్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది” అని డైరెక్టర్ సంపత్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన  వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

ఎదేమైనా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తెరకెక్కించిన నిర్మాతలకు, విడుదలకు ముందు ఇలాంటి పరిణామాలు కలగడం బాధాకరమని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇటీవలి కాలంలో పలువురు తెలుగు నటులు స్టేజీలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం వల్ల వివాదాలు చెలరేగుతున్నాయనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ కారణంగా సినిమాలపై ప్రతికూల ప్రభావం పడుతూ, నిర్మాతలు నష్టాల బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ వివాదం బరాబర్ ప్రేమిస్తా సినిమా ఫలితంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియాల్సి ఉంది.