హైదరాబాద్: బంగారం దొంగలు రెచ్చిపోతున్నారు. రామాంతపూర్ వాసవి నగర్లో ఓ ఇంట్లో చోరీ జరిగింది. 9 తులాల బంగారం, కిలో వెండి, 25 వేల రూపాయలు నగదును దొంగలు చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. రోజురోజుకూ పెరుగుతున్న బంగారం, వెండి ధరలు.. మహిళకు ప్రాణాంతకంగా మారుతున్నాయి. తులం బంగారం లక్షన్నర దాటడంతో అంతర్రాష్ట్ర ముఠాలతో పాటు స్థానిక దొంగలు మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్నారు.
ఒక్క స్నాచింగ్ చేస్తే తక్కువలో తక్కువ రూ.2 నుంచి రూ.3 లక్షల దాకా చేతికి అందుతుండడంతో చైన్స్నాచర్లు రెచ్చిపోతున్నారు. బైకులపై మెరుపు వేగంతో వచ్చి ఇంటి ముందు ముగ్గులు వేస్తున్న మహిళలుసహా రోడ్డుపై నడిచివెళ్లే వారి మెడలోంచి పుస్తెల తాళ్లు, చైన్లు తెంపుకెళ్తున్నారు. పట్ట పగలే రెచ్చిపోతున్న దొంగలు.. అడ్డొస్తే హత్య చేసేందుకూ వెనుకాడడం లేదు.
►ALSO READ | హైదరాబాద్ లేడీస్ హాస్టల్లో పేలిన గీజర్.. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం పొగలు, మంటలు
ముఖ్యంగా ఒంటరి, వృద్ధ మహిళలను టార్గెట్చేసి చంపి మరీ బంగారం ఎత్తుకెళ్తున్నారు. ఇలాంటి కేసుల్లో ఎక్కువగా తెలిసినవాళ్లే ఘాతుకాలకు పాల్పడుతున్నారు. ఒంటరి మహిళలు జాగ్రత్తగా ఉండాలని, ప్రస్తుతం జరుగుతున్న జాతరలకు ఎట్టి పరిస్థితుల్లోనూ బంగారు నగలు వేసుకొని వెళ్లకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
