- రెండేండ్లు ఎక్స్‌టర్నల్ ఎగ్జామినర్లతోనే ప్రాక్టికల్స్
హైదరాబాద్, వెలుగు: ప్రాక్టికల్ పరీక్షల విధానంలో ఇంటర్ బోర్డు కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు కేవలం సెకండ్ ఇయర్‌లో మాత్రమే నిర్వహించే ప్రాక్టికల్స్ విధానానికి స్వస్తి పలికి.. ఇకపై ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ లోనూ ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు సెక్రటరీ అభిలాష అభినవ్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ నిర్ణయంతో విద్యార్థులు అకడమిక్ ఇయర్ మొత్తం సబ్జెక్టుపై పట్టు సాధించే అవకాశం కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
కొత్త విధానం ప్రకారం.. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల్లో ప్రాక్టికల్ మార్కులను 15+15గా విభజించారు. దీంతో సెకండ్ ఇయర్ చివరలో 30 మార్కుల కోసం విద్యార్థులు పడే ఆందోళన తప్పుతుంది. ఫస్ట్ ఇయర్‌లోనే 15 మార్కులకు పరీక్ష రాయడంతో విద్యార్థులకు ప్రాక్టికల్స్‌పై అవగాహన పెరగడంతో పాటు సెకండ్ ఇయర్ నాటికి మరింత ఆత్మవిశ్వాసం వస్తుంది. థియరీ పరీక్షలు యథాతథంగా 60 మార్కులకే కొనసాగుతుండడంతో అకడమిక్ బ్యాలెన్స్ దెబ్బతినకుండా బోర్డు జాగ్రత్తలు తీసుకుంది. రెండు ఏండ్లలోనూ బోర్డు నియమించిన ఎక్స్‌టర్నల్ ఎగ్జామినర్ల పర్యవేక్షణలోనే పరీక్షలు జరగడంతో విద్యార్థుల్లో సబ్జెక్టుపై లోతైన అవగాహన పెరుగుతుంది.
ల్యాబ్ మ్యాన్యువల్స్ సిద్ధం
విద్యార్థులకు మరింత సులభంగా అర్థమయ్యేలా ఇంటర్ బోర్డు ఈసారి ల్యాబ్ మ్యాన్యువల్స్‌ను డిజిటల్ రూపంలో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. దానిలో కొత్త సిలబస్, మోడల్ క్వశ్చన్ పేపర్లు ఉంచారు. ప్రయోగం చేసే విధానాన్ని నెలవారీ ప్లాన్ ప్రకారం నేర్చుకునే వీలు కల్పించింది. పరీక్ష సమయంలో విద్యార్థులు రికార్డు బుక్ సమర్పించాల్సి ఉంటుంది. పరీక్షా సమయం గంటన్నర ఉండనున్నది. కాలేజీల్లో ల్యాబ్ క్లాసులను రెగ్యులర్‌గా నిర్వహించాలని, ప్రయోగాలకు కావాల్సిన కెమికల్స్, మైక్రోస్కోప్స్, ఇతర పరికరాలు సిద్ధం చేసుకోవాలని ప్రిన్సిపాళ్లను బోర్డు ఆదేశించింది. పరీక్షల్లో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
