మెక్సికో సిటీ: ఫిఫా వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. సోమవారం హోరాహోరీగా జరిగిన ప్రిక్వార్టర్స్‌లో ఇంగ్లండ్ 3–2 తేడాతో ఆతిథ్య మెక్సికోను చిత్తు చేసింది. ప్రతిష్టాత్మక అజ్టెకా స్టేడియంలో మెక్సికోకు ఇదే తొలి వరల్డ్ కప్ ఓటమి కావడం గమనార్హం. సరిగ్గా 40 ఏళ్ల కిందట (1986 వరల్డ్ కప్) ఇదే గ్రౌండ్‌లో అర్జెంటీనా లెజెండ్ డిగో మారడోనా చేతితో కొట్టిన ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ గోల్ వల్ల ఇంగ్లండ్ ఓడింది. ఇప్పుడు అదే వేదికపై హ్యారీ కేన్ తన కాలితో గోల్ కొట్టి పాత పరాజయానికి ప్రతీకారం తీర్చుకున్నాడు.
ఇంగ్లండ్ తరఫున జూడ్ బెల్లింగ్‌హామ్ 98 సెకన్ల వ్యవధిలో రెండు గోల్స్ కొట్టి మెక్సికోకు షాకిచ్చాడు. 36వ నిమిషంలో హెడర్‌తో గోల్ కొట్టిన అతను 38వ నిమిషంలో హ్యారీ కేన్ ఇచ్చిన పాస్‌ను గోల్ పోస్ట్‌లోకి పంపాడు. 42వ నిమిషంలో మెక్సికో ప్లేయర్ జూలియన్ క్వినోసెన్ గోల్ చేయడంతో 2–1 స్కోరుతో తొలి హాఫ్ ముగిసింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన సెకండాఫ్ 54వ నిమిషంలో ఇంగ్లండ్ డిఫెండర్ క్వాన్సా ప్రమాదకర ఫౌల్ చేయడంతో అంపైర్ రెడ్ కార్డుతో బయటకు పంపాడు.
దాంతో ఇంగ్లండ్ 10 మంది ప్లేయర్లతోనే ఆడాల్సి వచ్చింది. ఈ దశలో మెక్సికో గోల్ కీపర్ రావుల్ రాంజెల్ తప్పు చేయడంతో ఇంగ్లండ్‌కు పెనాల్టీ లభించింది. దీన్ని 60వ నిమిషంలో హ్యారీ కేన్ గోల్‌గా మలిచి ఆధిక్యాన్ని 2–1కి పెంచాడు. వరల్డ్ కప్‌లో కేన్‌కు ఇది ఆరో గోల్ కావడం విశేషం. 69వ నిమిషంలో కేన్ చేసిన ఫౌల్ కారణంగా మెక్సికోకు పెనాల్టీ లభించింది. దీన్ని రావుల్ జిమినెజ్ గోల్‌గా మల్చడంతో ఇంగ్లండ్ ఆధిక్యం 3–2కు తగ్గింది. చివరి 30 నిమిషాల పాటు మెక్సికో ఆటగాళ్లు గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించినా, ఇంగ్లండ్ గోల్ కీపర్ జోర్డాన్ పిక్‌ఫోర్డ్ సమర్థంగా అడ్డుకున్నాడు.
