భర్త నరాల్లోకి హార్పిక్ ఎక్కించి హత్య.. ప్రియుడితో కలిసి చంపిన భార్య.. నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన

భర్త నరాల్లోకి  హార్పిక్ ఎక్కించి హత్య.. ప్రియుడితో కలిసి చంపిన భార్య.. నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన
  • వివాహేతర సంబంధానికి అడ్డురాకుండా ఘాతుకం 
  • అంతకుముందు మద్యం తాగించి డాబాపై నుంచి తోసేసి హత్యాయత్నం
  • నిజామాబాద్‌‌‌‌ జిల్లా న్యాల్​కల్‌‌‌‌లో ఘటన 
  • మృతుడి తల్లి ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు.. ముగ్గురు నిందితుల అరెస్ట్

నిజామాబాద్ రూరల్, వెలుగు: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ భార్య భర్తను అతి దారుణంగా హత్య చేసింది. భర్త నరాల్లోకి టాయిలెట్‌‌‌‌ను కడిగే హార్పిక్‌‌‌‌తో పాటు నిద్ర మాత్రల లిక్విడ్‌‌‌‌ను సిరంజీ సహాయంతో ఎక్కించి చంపేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన నిజామాబాద్‌‌‌‌ జిల్లా మోపాల్ మండలం న్యాల్‌‌‌‌కల్ గ్రామంలో జరిగింది. మృతుడి తల్లి శ్యామల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులకు దర్యాప్తులో కీలక విషయాలు తెలిశాయి. సోమవారం నిజామాబాద్‌‌‌‌ సౌత్‌‌‌‌ సీఐ సురేశ్​ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. న్యాల్‌‌‌‌కల్ గ్రామానికి చెందిన దాయిని ప్రశాంత్​(35) బతుకుదెరువు కోసం మూడేండ్ల క్రితం దుబాయ్‌‌‌‌కు వలస వెళ్లాడు. అతడు దుబాయ్ వెళ్లిన తర్వాత భార్య సంధ్యకు నిజామాబాద్‌‌‌‌లోని ఇంద్రాపూర్ కాలనీకి చెందిన అనిల్‌‌‌‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. మూడేండ్ల తర్వాత ప్రశాంత్ గత నెల 27న దుబాయ్‌‌‌‌ నుంచి ఇంటికి తిరిగి వచ్చాడు. దీంతో తన వివాహేతర సంబంధానికి భర్త ప్రశాంత్ అడ్డుగా ఉంటాడని భావించిన సంధ్య.. ప్రియుడు అనిల్‌‌‌‌తో కలిసి హత్య చేయాలని ప్లాన్ చేసింది.
 
ఫుల్‌‌‌‌గా మందు తాగించి, దాబాపై నుంచి తోసేసి..

భర్తను చంపేందుకు న్యాల్‌‌‌‌కల్‌‌‌‌లో తమ ఇంటి దగ్గర ఉండే వెంకటసాయి అలియాస్ బంటి (24) అనే మరో యువకుడి సాయాన్ని సంధ్య కోరింది. గత నెల 29న వెంకటసాయి మద్యం బాటిల్ తీసుకుని ప్రశాంత్ ఇంటికి వెళ్లాడు. దాబా మీద ఇద్దరు మందు తాగుతుండగా బంటికి సంధ్య ఫోన్ చేసి తన భర్తకు ఫుల్‌‌‌‌గా మద్యం తాగించాలని చెప్పింది. ఈ ఆడియో క్లిప్ వైరల్‌‌‌‌గా మారింది. సంధ్య చెప్పినట్టే ప్రశాంత్‌‌‌‌కు బంటి అతిగా మద్యం తాగించి, దాబాపై నుంచి కిందికి తోసేశాడు. అయితే, ప్రశాంత్​తీవ్రంగా గాయపడినప్పటికీ చనిపోలేదు. దాంతో సంధ్య అక్కడకు వచ్చి ప్రమాదవశాత్తు దాబా మీద నుంచి పడ్డాడని ఇరుగుపొరుగు వారిని నమ్మించింది. అనంతరం నిజామాబాద్ జీజీహెచ్‌‌‌‌కు అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి ప్రశాంత్‌‌‌‌ను తీసుకెళ్లింది. ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ అనంతరం అదే రోజు రాత్రి భర్తను ఇంటికి తీసుకొచ్చింది. 

తల్లి ఫిర్యాదుతో...

భర్త ప్రశాంత్‌‌‌‌ను హాస్పిటల్​ నుంచి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత సంధ్య తన ప్రియుడు అనిల్‌‌‌‌కు ఫోన్‌‌‌‌ చేసి న్యాల్‌‌‌‌కల్‌‌‌‌లో ఉన్న ఇంటికి పిలిపించుకుంది. తర్వాత ఇద్దరు కలిసి హార్పిక్‌‌‌‌తో పాటు నిద్ర మాత్రలను పొడి చేసి నీళ్లలో కలిపిన లిక్విడ్‌‌‌‌ను సిరంజీ సహాయంతో ప్రశాంత్‌‌‌‌ నరాల్లో ఎక్కించి, చంపేశారు. అనంతరం ప్రశాంత్‌‌‌‌ చనిపోయిన విషయాన్ని నిజామాబాద్‌‌‌‌లో ఉంటున్న అతడి తల్లి శ్యామలకు సంధ్య చెప్పింది. అయితే, తన కొడుకు దుబాయ్‌‌‌‌ నుంచి రావడం, దాబాపై నుంచి కింద పడడం, ఆసుపత్రికి తీసుకెళ్లడం, తర్వాత అతడు చనిపోయే వరకు ఏ విషయం తల్లికి తెలియదు. 

దీంతో కోడలు సంధ్య ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేసిన శ్యామల.. కొడుకు మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంధ్యను అదుపులోకి తీసుకొని విచారించగా, అసలు విషయం బయటపడింది. అనిల్‌‌‌‌, బంటితో కలిసి భర్త ప్రశాంత్‌‌‌‌ను తానే హత్య చేసినట్లు విచారణలో ఒప్పుకుంది. దీంతో అనిల్‌‌‌‌, బంటిలను అరెస్ట్ చేసి, ముగ్గురిని రిమాండ్‌‌‌‌కు తరలించారు.