2028 జూన్‌‌ నాటికి ఎస్‌‌ఎల్‌‌బీసీ పూర్తి..అది ఇంజినీరింగ్ నిర్మాణం కాదు.. దక్షిణ తెలంగాణ ఆకాంక్ష: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

2028 జూన్‌‌ నాటికి ఎస్‌‌ఎల్‌‌బీసీ పూర్తి..అది ఇంజినీరింగ్ నిర్మాణం కాదు.. దక్షిణ తెలంగాణ ఆకాంక్ష: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • టన్నెల్, రిజర్వాయర్లు, కాలువల పనులు సమాంతరంగా పూర్తి చేస్తం
  • సిబ్బందిని మూడింతలు పెంచినం.. ఆధునిక యంత్రాలు వస్తున్నయ్ 
  • పునరుద్ధరణ తర్వాత టన్నెల్ పనులు అర కిలోమీటర్ పూర్తయినట్టు వెల్లడి 

హైదరాబాద్, వెలుగు: దక్షిణ తెలంగాణ రైతుల దశాబ్దాల కల అయిన ఎస్‌‌ఎల్‌‌బీసీ ప్రాజెక్టును జూన్–2028 నాటికి తప్పకుండా పూర్తి చేస్తామని ఇరిగేషన్  శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అదే సమయంలో టన్నెల్ పనుల్లో పాల్గొంటున్న కార్మికుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని తేల్చిచెప్పారు. సోమవారం సెక్రటేరియెట్‌‌లో ఎస్‌‌ఎల్‌‌బీసీ ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్‌‌ కుమార్‌‌‌‌రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ ప్రాజెక్టు కేవలం ఇంజినీరింగ్ నిర్మాణం మాత్రమే కాదని, దక్షిణ తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షకు రూపం ఇవ్వడమేనని పేర్కొన్నారు. ప్రభుత్వం అవసరమైన నిధులు, భూసేకరణ, సాంకేతిక అనుమతులు, పరిపాలనా అనుమతులను వేగంగా పూర్తి చేసి.. పనులు నిరంతరాయంగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. టన్నెల్‌‌తోపాటు డిండి ప్రాజెక్టు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, కాలువల నిర్మాణాన్ని ఒకే సమగ్ర ప్రాజెక్టుగా భావించి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు సవరించిన పరిపాలనా అనుమతి వ్యయం సుమారు రూ.12,718 కోట్లు అని తెలిపారు.

టన్నెల్ అర కిలోమీటర్ పూర్తి

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో టన్నెల్ పనులు పునఃప్రారంభించిన తర్వాత ఇప్పటికే అర కిలోమీటర్‌‌కు పైగా పురోగతి నమోదైందని మంత్రి ఉత్తమ్ కుమార్‌‌‌‌రెడ్డి తెలిపారు. దేవరకొండ వైపు నుంచి పనులు సంతృప్తికరంగా కొనసాగుతున్నాయని, శ్రీశైలం వైపు కూడా అన్ని భద్రతా ప్రమాణాలు పాటిస్తూ పనులు సాగుతున్నాయని చెప్పారు. టన్నెల్ పనులను మరింత వేగవంతం చేసేందుకు 3 అత్యాధునిక ఆర్మ్ బూమర్ యంత్రాలు ముంబై పోర్టుకు చేరాయని, ఈ నెలాఖరులో పనుల ప్రదేశానికి చేరుకుంటాయని తెలిపారు.

టన్నెల్ వద్ద పనిచేసే సిబ్బందిని ఇప్పటికే మూడింతలు పెంచామని, అదనపు యంత్రాలు, ప్రత్యేక పరికరాలు, సాంకేతిక నిపుణులను సమీకరిస్తున్నట్టు చెప్పారు. యంత్రాల రవాణా, కస్టమ్స్ అనుమతులు, సాంకేతిక సిబ్బంది నియామకంలాంటి అంశాల్లో ఎలాంటి ఆలస్యం జరగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డిండి ప్రాజెక్టు, నక్కలగండి రిజర్వాయర్, పెండ్లిపాకల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, కాలువల నెట్‌‌వర్క్ పూర్తయితేనే ఎస్‌‌ఎల్‌‌బీసీ పూర్తి ప్రయోజనాలు రైతులకు అందుతాయని  ఉత్తమ్ తెలిపారు.

భూసేకరణ పరిహారాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. హై లెవల్ కెనాల్, లో లెవల్ కెనాల్, ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం, కాలువల సామర్థ్య పెంపు పనులపైనా సమీక్ష నిర్వహించిన మంత్రి, అవసరమైన చోట కాలువలను విస్తరించి భవిష్యత్తులో అదనపు నీటి ప్రవాహాలను సురక్షితంగా మోయగల విధంగా రూపకల్పన చేయాలని అధికారులను ఆదేశించారు.