హైదరాబాద్, వెలుగు: కన్నెపల్లి పంప్ హౌస్‌లో మోటార్లు ఆన్ చేసి150 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం ఉన్నా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. ఈ ప్రభుత్వానికి చేతగాకపోతే వారం రోజుల పాటు కేసీఆర్‌కు అప్పగిస్తే మెత్తం నీరు పారించి చూపుతామని చెప్పారు. మంత్రి ఉత్తమ్ చెప్తున్నట్టు ఏమైనా ప్రమాదం జరిగితే బీఆర్ఎస్ బాధ్యత తీసుకుంటుందని తెలిపారు.
ప్రమాదం జరిగితే బీఆర్ఎస్‌ను రద్దు చేసి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటామని పేర్కొన్నారు. మంత్రి ఉత్తమ్ అడిగినా.. కేబినెట్ అడిగినా తెలంగాణ ప్రజల తరపున కేసీఆర్ అండర్ టేకింగ్ ఇస్తారని వెల్లడించారు. సోమవారం ఆయన మరో ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డతో ఎన్డీఎస్ఏకు ఏ మాత్రం సంబంధం లేదని వివరించారు.
అలా అయితే ఎస్ఎల్‌బీసీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ జైలుకు పోవాలన్నారు. శ్రీధర్ బాబు లాంటి వాళ్లు కూడా పదవీ భయంతో రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులు ఒత్తుతున్నారని, మంత్రులు తెలంగాణ ఆత్మను కోల్పోయారని విమర్శించారు.
లిఫ్ట్ చెయ్యకుంటే మళ్లీ చలో కన్నెపల్లి: గంగుల
నీటిని ఎత్తిపోయకపోతే మళ్లీ చలో కన్నెపల్లి, ఎల్లంపల్లి పిలుపునిస్తామని గంగుల కమలాకర్ అన్నారు. అన్నారం, సుందిళ్లలో నీరు నిల్వ చేయవద్దని ఎన్‌డీఎస్‌ఏ చెప్పలేదని, చిన్న చిన్న అంశాలు ఉంటే మరమ్మత్తు చేయాలని ఎన్‌డీఎస్ఏ సూచించిందని తెలిపారు. భద్రాచలం కొట్టుకుపోతుందని ఉత్తమ్ అంటున్నారని, ఎవరిని భయపెట్టాలని చూస్తున్నారని మాజీ ఎంపీ వినోద్ కుమార్ ప్రశ్నించారు.
2021లో భారీ వరదతో 29 లక్షల క్యూసెక్కుల ప్రవాహం 250 టీఎంసీల నీరు వెళ్లినా భద్రాచలంకు ఏమీ కాలేదని పేర్కొన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద వందల లారీలు పెట్టి ఇసుక తవ్వుతున్నారని, అందుకోసమే ఆనకట్టల్లో నీరు నింపడం లేదని మండిపడ్డారు.
