నాటింగ్‌హామ్: ఇంగ్లండ్ టూర్‌లో ఒక్క విజయం కూడా నమోదు చేయని టీమిండియా ఇంగ్లండ్‌తో మూడో టీ20 మ్యాచ్‌కు రెడీ అయ్యింది. మంగళవారం జరిగే ఈ పోరులో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని పట్టుదలగా ఉంది. ఈ కీలక మ్యాచ్‌లో ఫామ్‌లేమితో ఇబ్బందిపడుతున్న లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను పక్కనబెట్టి అదనపు పేసర్‌ను బరిలోకి దించాలని మేనేజ్‌మెంట్ యోచిస్తోంది.
రెండో టీ20లో నాలుగో ఓవర్లు వేసిన బిష్ణోయ్ 60 రన్స్ ఇచ్చాడు. ఒకే ఓవర్‌లో 29 రన్స్ ఇవ్వడంతో పాటు మూడు నో బాల్స్ వేసి ఇండియా ఓటమికి ప్రధాన కారకుడయ్యాడు. ఇప్పటికే అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తిలాంటి స్పిన్నర్లు ఉండటంతో బిష్ణోయ్ అవసరమా..? అనే విమర్శలు మొదలయ్యాయి. బిష్ణోయ్ ప్లేస్‌లో పేసర్ ప్రిన్స్ యాదవ్‌ను జట్టులోకి తీసుకునే చాన్స్ ఉంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు ఓడిపోవడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది.
ఐపీఎల్‌లో ఫ్లాట్ పిచ్‌లపై ఆడిన ఇండియన్ బ్యాటర్లు.. ఇంగ్లిష్ వికెట్లపై లభించే అదనపు బౌన్స్, స్వింగ్‌ను ఎదుర్కోవడంలో నానా ఇబ్బందులు పడుతున్నారు. శ్రేయస్, ఇషాన్ రన్స్ చేస్తున్నా.. ఇంగ్లండ్ బౌలింగ్‌ను దీటుగా ఆడలేకపోతున్నారు. సామ్ కరన్ వైవిధ్యమైన బంతుల ముందు తిలక్ వర్మ తడబడుతున్నాడు. అభిషేక్ శర్మ 59, 43 రన్స్‌తో ఫర్వాలేదనిపించాడు. వైభవ్ సూర్యవంశీ ఫెయిల్ కావడం అతిపెద్ద మైనస్‌గా మారింది.
మరోవైపు ఇంగ్లండ్ అన్ని అంశాల్లో పటిష్టంగా కనిపిస్తోంది. సొంత గడ్డపై ఆడుతుండటం అదనపు ప్రయోజనంగా మారింది. గత రెండు మ్యాచ్‌ల్లో ఇండియా 189, 190 రన్స్ చేసినా ఇంగ్లండ్ బ్యాటింగ్ బలానికి ఆ స్కోర్లు సరిపోవడం లేదు. బెథెల్, బ్రూక్స్, బాంటన్ ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. సాల్ట్, బట్లర్ బ్యాట్లు ఝుళిపిస్తే పరుగుల వరద ఖాయం. ఇంగ్లండ్ బౌలింగ్‌లో పెద్దగా ఇబ్బందులు కనిపించడం లేదు.
