ఇంటింటికీ వెళ్లని సర్.. తమ వద్దకే రావాలి.. లేదంటే ఓటు ఉండదంటూ బీఎల్‌‌వోల హుకుం

ఇంటింటికీ వెళ్లని సర్.. తమ వద్దకే రావాలి.. లేదంటే ఓటు ఉండదంటూ బీఎల్‌‌వోల హుకుం
  • రాకపోతే ఓటు ఉండదంటూ హెచ్చరికలు 
  • ప్రతి ఇంటినీ 3 సార్లు విజిట్​ చేయాలనే నిబంధన బేఖాతరు
  • ఫారం నింపేందుకు సహకరించడంలోనూ తీవ్ర నిర్లక్ష్యం
  • 91% ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ చేశామన్న అధికారులు
  • క్షేత్రస్థాయిలో మాత్రం చాలామందికి అందని ఫారాలు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్​ ఇంటెన్సివ్​ రివిజన్​ (సర్)  ప్రక్రియ.. క్షేత్రస్థాయిలో సవాళ్లు, సమస్యల మధ్య సాగుతున్నది. నిబంధనల ప్రకారం ప్రతి బూత్ స్థాయి అధికారి (బీఎల్‌‌వో) ఓటరు ఇంటికి మూడుసార్లు వెళ్లి ఫారాలు అందజేసి, వివరాలు సేకరించాల్సి ఉండగా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ‘‘మేం పంచాయతీ ఆఫీసులో ఉన్నాం.. ఇక్కడికే వచ్చి మీ ఫారాలు తీసుకెళ్లండి. వివరాలు నింపి, ఇచ్చి వెళ్లండి” అంటూ బీఎల్‌‌వోలు ఓటర్లకు ఫోన్లు చేసి ఆదేశిస్తున్నారు.  

ఒకవేళ ఓటర్లు రాకపోతే ఓటు తొలగిస్తామంటూ హెచ్చరిస్తుండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలే బీఎల్‌‌వోలు చెప్పిన చోటుకు వెళ్లి ఫారాలు తెచ్చుకుంటున్నారు. ఎన్యూమరేషన్​ ఫారాలు సోమవారం నాటికి 91.85 శాతం పంపిణీ చేసినట్టు అధికారులు చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో చాలా మందికి ఫారాలు అందలేదనే ఫిర్యాదులు వస్తున్నాయి.  రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 3,10,69,592 ఫారాలను పంపిణీ చేశారు. ఇంకా 27.56 లక్షల ఫారాల పంపిణీ పెండింగ్‌‌లోనే ఉంది.  మూడు రోజుల కిందటి వరకే ఫారాల పంపిణీ పూర్తి కావాలి. కానీ క్షేత్రస్థాయిలో బీఎల్‌‌వోల నిర్లక్ష్యంతోపాటు పట్టణ ప్రాంతాల్లో అడ్రస్‌‌లు దొరకక పంపిణీ ఆలస్యమవుతున్నది. ఇక వాటిని నింపి వివరాలను డిజిటలైజేషన్ చేసే  ప్రక్రియ కూడా నత్తనడకన సాగుతున్నది.

ఇంటింటికీ వెళ్లడం లేదు.. ఆఫీసులకే రమ్మంటున్నారు!

రాష్ట్రంలో ‘సర్‌‌‌‌’ ఫారాల పంపిణీ 91 శాతానికి పైగా పూర్తయినట్టు కాగితాల్లో కనిపిస్తున్నా, వాస్తవ పరిస్థితి మరోలా ఉంది. నిబంధనల ప్రకారం బీఎల్‌‌వోలే స్వయంగా ఓటర్ల ఇండ్లకు వెళ్లి ఫారాలు ఇవ్వాలి. కానీ, అనేక ప్రాంతాల్లో వారు ఇండ్లకు వెళ్లకుండా, ఆయా కార్యాలయాలకో లేదా తాము చెప్పిన ప్రాంతాలకో ఓటర్లను రమ్మంటూ హుకుం జారీ చేస్తున్నారు. ఫారాలు తీసుకెళ్లకపోతే ఓట్లు తొలగిపోతాయంటూ బెదిరింపు ధోరణికి దిగుతుండటంతో, ఓటర్లు తప్పనిసరి పరిస్థితుల్లో పనులన్నీ మానుకొని బీఎల్‌‌వోల చుట్టూ తిరగాల్సి వస్తోంది. 

ఫారాల్లో వివరాల నమోదు విషయంలోనూ బీఎల్‌‌‌‌వోలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  పట్టణ ప్రాంతాల్లో బీఎల్‌‌‌‌వోలకు ఓ పెద్ద టాస్క్ ఎదురవుతోంది. గతంలో అద్దెకు ఉన్న ఓటర్లు ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారో తెలియక, వారి ఫోన్ నెంబర్లు కూడా అందుబాటులో లేకపోవడంతో ప్రస్తుతం వారి ఆచూకీ కనుగొనడం  కత్తిమీద సాములా మారింది. దీనికి తోడు, బీఎల్‌‌‌‌వోలు నేరుగా ఫారాలను ఓటర్ల చేతికి ఇచ్చి, ‘‘మీరే పూర్తి చేసుకోండి’’ అని చెప్పి వెళ్లిపోతుండటంతో.. ఆ ఫారాలను ఎలా నింపాలో, ఏ వివరాలు ఎక్కడ రాయాలో తెలియక సామాన్య ఓటర్లు తికమకపడుతున్నారు. సరైన గైడెన్స్​ లేక ఫారాల భర్తీ ప్రక్రియ పూర్తిగా గందరగోళంలో పడింది.

హెల్ప్ డెస్క్‌‌‌‌ల ఏర్పాటు.. సంతకాలు, ఫొటోలు తప్పనిసరి

నగరాలు, పట్టణాల్లో ఓటర్ల సహాయం కోసం హైదరాబాద్‌‌‌‌లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన 16 హెల్ప్ డెస్క్‌‌‌‌లతో పాటు అవసరమైన అన్ని చోట్లా అదనపు హెల్ప్ డెస్క్‌‌‌‌లను ఏర్పాటు చేయాలని సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. పూర్తి చేసిన ప్రతి ఎన్యూమరేషన్ ఫారంలో సదరు ఓటరుతోపాటు బీఎల్‌‌‌‌వో సంతకం, అలాగే ఓటరు ఫొటో కచ్చితంగా ఉండేలా సరిచూసుకోవాలన్నారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించాలని, సమాంతరంగా డిజిటలైజేషన్ (ఆన్‌‌‌‌లైన్ నమోదు) ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.

ఓ టర్ల జాబితా హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) ప్రక్రియపై కలెక్టర్లకు  సీఈవో కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. ఒకే కుటుంబానికి చెందిన ఓటర్ల పేర్లు వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో కాకుండా, అందరి పేర్లు ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆన్‌‌‌‌లైన్ ద్వారా వచ్చే ఫారాలను కూడా బీఎల్‌‌‌‌వోలు క్షుణ్నంగా సరిచూసుకోవాలని, ఈ ఫారాల భర్తీపై బీఎల్‌‌‌‌వోలు, సూపర్‌‌‌‌వైజర్లకు మరో విడత శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. అదేవిధంగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసి, ‘సర్‌‌‌‌‌‌‌‌’ ప్రక్రియపై వారికి పూర్తి అవగాహన కల్పించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌లో డిప్యూటీ ఎన్నికల అధికారి చారి, డిప్యూటీ కలెక్టర్ (ఎస్‌‌‌‌జీడీసీ) చెన్నయ్య, పీఎం ఐటీ చిరంజీవి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఫారాల పంపిణీ ఈ రోజుతో పూర్తి కావాల్సిందే..

ఓటర్ల ఎన్యూమరేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, మంగళవారం  నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ100 శాతం ఫారాల పంపిణీ పూర్తి కావాలని అధికారులను  సీఈవో సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. సోమవారం అదనపు సీఈవో వాసం వెంకటేశ్వర్లు రెడ్డితో కలిసి సెక్రటేరియెట్‌‌ నుంచి కలెక్టర్లతో ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  క్షేత్రస్థాయిలో ఎన్యూమరేషన్ ఫారాలను పూరించడంలో సూపర్‌‌ వైజర్లు కీలక పాత్ర పోషించాలని సీఈవో సూచించారు. ఎక్కడైనా బీఎల్‌‌వోలు బలహీనంగా ఉంటే వారిని గుర్తించి, ఫారాల భర్తీలో సూపర్‌‌వైజర్లు నేరుగా సహకరించాలన్నారు. ఓటర్లకు తికమక లేకుండా ఫారాలు నింపేందుకు స్థానికంగా ఉండే వలంటీర్లను గుర్తించి, వారి ద్వారా సహాయం అందించాలని కలెక్టర్లను ఆదేశించారు. అంతేకాకుండా, ప్రజల సౌకర్యార్థం సంబంధిత సూపర్‌‌వైజర్ల ఫోన్ నంబర్లను మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారంలోకి తీసుకురావాలన్నారు.

రెండు జిల్లాల్లోనే వంద శాతం

రాష్ట్రంలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియలో నిర్మల్ జిల్లా 100 శాతం పంపిణీతో అగ్రస్థానంలో నిలిచింది. దీని తర్వాత జోగులాంబ గద్వాల 100%, వనపర్తి 99.87%, జనగాం 99.65%, ఖమ్మం జిల్లా 99.51% పంపిణీతో టాప్-5 జిల్లాలుగా నిలిచాయి. కాగా, ఈ ప్రక్రియలో అత్యంత వెనుకబడిన చివరి 10 జిల్లాలలో హైదరాబాద్ 71.14% పంపిణీతో  చివరి స్థానంలో ఉంది. దీంతో పాటు మేడ్చల్ మల్కాజ్‌‌‌‌గిరి 73.12%  , రంగారెడ్డి 87.35%, సంగారెడ్డి 90.49%, వికారాబాద్ 93.89%, కామారెడ్డి 94.65%, మెదక్ 95.23%, నిజామాబాద్ 95.27%, నారాయణపేట 95.33%, పెద్దపల్లి జిల్లా 95.48%  ఫారాల పంపిణీతో అత్యంత వెనుకబడిన జిల్లాల లిస్ట్‌‌‌‌లో నిలిచాయి.