- శాఖల సమన్వయానికి ప్రత్యేక కమిటీలు వేసుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి
- సదస్సు విజయవంతానికి పకడ్బందీ ప్రణాళికలు ఉండాలి
- ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ ఎకో టూరిజం
- మంజీరా, దిల్ కుషా గెస్ట్‌హౌస్‌లకు ఆధునిక హంగులు
- యాదగిరిగుట్ట తరహాలో వికారాబాద్ వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధి
- వికారాబాద్ ప్రాంతాన్ని టూరిస్ట్ హబ్‌గా మార్చాలని అధికారులకు ఆదేశాలు
- గ్లోబల్ సమిట్, పర్యాటక శాఖపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష
హైదరాబాద్, వెలుగు: ఈ డిసెంబర్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన ‘గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమిట్’ సన్నాహక కసరత్తును ఇప్పటి నుంచే ప్రారంభించాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. గత సమిట్ సాధించిన ఫలితాలను, అనుభవాలను విశ్లేషించుకొని, రాబోయే సదస్సును మరింత విజయవంతం చేసేలా పకడ్బందీ ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఈ సదస్సు విజయవంతం కోసం వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఎంతో అవసరమని, అందుకోసం వెంటనే ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ ‘బోధి
పెవిలియన్’లో గ్లోబల్ సమిట్‌తోపాటు పర్యాటక శాఖపై సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
రాష్ట్ర రాజధాని చుట్టుపక్కల ప్రాంతాలను పర్యావరణహిత పర్యాటక కేంద్రాలుగా (ఎకో-టూరిజం) తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని వెల్లడించారు. భవిష్యత్తు అవసరాల కోసం నిర్మిస్తున్న ‘ఫ్యూచర్ సిటీ’ పరిధిలో ఉన్న అటవీ భూములను అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని సూచించారు. నగర శివార్లలోని అటవీ శాఖ భూములను పర్యాటక శాఖతో సమన్వయం చేసుకుంటూ పర్యావరణాన్ని దెబ్బతీయకుండా పర్యాటకులను ఆకర్షించేలా ఎకో టూరిజం ప్రాజెక్టులుగా మార్చాలని ఆదేశించారు. నగరంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న గుర్రంగూడ ఎకో పార్క్ నమూనాను అధ్యయనం చేసి, అదే తరహాలో నగరంలోని ఇతర ప్రాంతాల్లో మరిన్ని సరికొత్త ఎకో పార్కులను, అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఏర్పాటు చేయాలన్నారు.
ఈ అర్బన్ ఫారెస్ట్ ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయడానికి, పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక అధికారిని తక్షణమే నియమించుకొని, పనులను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.
వికారాబాద్‌కు సరికొత్త పర్యాటక రూపం
తెలంగాణ సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఆధ్యాత్మిక, చారిత్రక పర్యాటక రంగాలకు పూర్వవైభవం తీసుకురావాలని అధికారులకు సీఎం రేవంత్ దిశా నిర్దేశం చేశారు. ఇందులో భాగంగా వికారాబాద్‌లోని ప్రసిద్ధ వీరభద్రస్వామి దేవాలయాన్ని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ తరహాలోనే అభివృద్ధి చేసేందుకు ఒక ప్రత్యేక టెంపుల్ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు.
టూరిజం హబ్ డెవలప్‌మెంట్ పథకం కింద వికారాబాద్ ప్రాంతాన్ని పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేందుకు నిధులు, ప్రణాళికలతో ముందుకు సాగాలని స్పష్టం చేశారు. తారామతి బారామతి ప్రాంగణాన్ని అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా పర్యాటక హంగులతో మరింతగా విస్తరించాలన్నారు. నగరంలోని పురాతన పురానాపూల్ హెరిటేజ్ బ్రిడ్జిని పునరుద్ధరించి పర్యాటక కేంద్రంగా మార్చాలని, ఆ మార్గంలో ట్రాఫిక్‌ను ఇతర వైపులా మళ్లించి బ్రిడ్జిపై పర్యాటకులు మాత్రమే నడిచేలా వసతులు కల్పించాలని ఆదేశించారు.
మంజీరా, దిల్ కుషా గెస్ట్ హౌస్‌లకు హంగులు
హైదరాబాద్ నగర గుండెకాయ లాంటి దుర్గం చెరువును కేవలం ఒక సరస్సులా కాకుండా, పూర్తిస్థాయి అంతర్జాతీయ పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను రేవంత్‌రెడ్డి ఆదేశించారు. బోటింగ్, వాటర్ స్పోర్ట్స్, పార్కులు, పర్యాటకులకు అవసరమైన అన్ని రకాల ప్రపంచ స్థాయి వసతులను అక్కడ కల్పించాలని సూచించారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న చారిత్రక ప్రాధాన్యత కలిగిన మంజీరా , దిల్ కుషా గెస్ట్ హౌస్‌లను వాటి పురాతన శైలి దెబ్బతినకుండా ఆధునిక హంగులతో పునరుద్ధరించాలని స్పష్టం చేశారు.
ఈ పనుల ద్వారా ప్రభుత్వ అతిథి గృహాలకు నూతన కళ తీసుకురావచ్చన్నారు. సమీక్షలో చర్చించిన అన్ని పర్యాటక ప్రాజెక్టులను ఒక నిర్దేశిత కాలపరిమితిని నిర్దేశించుకొని పారదర్శకంగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో సీఎం ప్రభుత్వ ప్రధాన సలహాదారు రామకృష్ణారావు, ఐటీ, పరిశ్రమల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, టూరిజం అధికారులు పాల్గొని పర్యాటక రంగ అభివృద్ధి ప్రణాళికలను సీఎంకు వివరించారు.
