సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్‌లో సహాయ నటిగా తనదైన ముద్ర వేసుకున్న వాహిని అలియాస్ పద్మక్క కన్నుమూశారు. గత కొంతకాలంగా ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న ఆమె, పరిస్థితి విషమించడంతో బుధవారం సాయంత్రం (2026 ఫిబ్రవరి 4న) తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలిసి పలువురు సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో వాహిని మరణవార్తను ఆమె సన్నిహితురాలు, నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియా వేదికగా ధృవీకరించారు. విజయనగరంలో తన పెదనాన్న ఇంటి పక్కనే ఉండే పద్మక్క గురించి, వ్యక్తిగత అనుబంధాన్ని ఎన్నోసార్లు కల్యాణి గుర్తు చేసుకున్నారు. ఇపుడు ఆమె మరణవార్తను షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. కళ్యాణి చేసిన పోస్ట్, సినీ అభిమానులను, నెటిజన్లని దిగ్బ్రాంతికి గురిచేస్తోంది.
ఎవరీ జయవాహిని?
1978లో విజయనగరంలో జన్మించిన వాహిని, తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో సహాయ నటిగా పనిచేసింది. టెలివిజన్, సినీ రంగాల్లో చిన్న పాత్రలతో తన నట ప్రస్థానాన్ని స్టార్ట్ చేసి ప్రేక్షకులను మెప్పించింది. సినిమాల కంటే టెలివిజన్ సీరియల్స్ లోనే ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ముఖ్యంగా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నరేశ్, విజయకృష్ణ ముఖ్య పాత్రల్లో నటించిన ‘రఘుపతి వెంకయ్య నాయుడు’ చిత్రంలో కథానాయికగా వాహిని నటించి ప్రశంసలు పొందింది. అలాగే, ఆమె చివరిగా ‘బహిర్భూమి’ మరియు ‘పోలీస్ వారి హెచ్చరిక’ సినిమాల్లో నటించింది.
ఆరోగ్యం విషమం, భారీగా వైద్య ఖర్చు:
చిన్న చిన్న పాత్రల ద్వారా తెలుగు, తమిళ పరిశ్రమల్లో గుర్తింపు తెచ్చుకున్న పద్మక్క (జయవాహిని) ఇటీవలే హైదరాబాద్‌లోని ఒక ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స తీసుకుంది. క్యాన్సర్ ముదరడం వల్ల ఆమెకు మల్టీ ఆర్గాన్స్ దెబ్బతిన్నాయని, ఆమెకు తక్షణమే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU) చికిత్స అత్యవసరమని డాక్టర్లు తెలిపారని ఇటీవలే కల్యాణి పోస్ట్ చేసింది.
“కీమోథెరపీ, ఆపరేషన్, నిరంతర ఐసీయూ సంరక్షణ కోసం వైద్యులు దాదాపు రూ.25 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ భారాన్ని పద్మక్క కుటుంబం మోయలేని పరిస్థితి నెలకొంది. ఆర్టిస్ట్ జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో తెలియదని” ఎమోషనల్ అవుతూ కరాటే కల్యాణి పోస్ట్ ద్వారా తెలిపింది. ఈ క్రమంలోనే ఇలా వాహిని మరణించడం ఎంతో విషాదం నింపింది.
