షిల్లాంగ్: మేఘాలయలో ఘోర ప్రమాదం జరిగింది. బొగ్గు గనిలో భారీ పేలుడు జరిగి 16 మంది ప్రాణాలు కోల్పోయారు. బొగ్గు గనిలో మరింత మంది చిక్కుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. రెస్క్యూ టీం సహాయక చర్యలు కొనసాగిస్తోంది. తూర్పు జైంతియా హిల్స్ జిల్లాలోని గనిలో బొగ్గు తవ్వకాలు సమయంలో పేలుడు జరిగింది. గురువారం ఉదయం సమయంలో థాంగ్స్కు (Thangsku) ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ బొగ్గు గనిని అక్రమ బొగ్గు గనిగా అధికారులు గుర్తించారు.
మేఘాలయలోని తూర్పు జైంటియా హిల్స్ జిల్లాలోని అక్రమ బొగ్గు గనిలో గురువారం జరిగిన పేలుడులో కనీసం 16 మంది కార్మికులు మరణించారని.. ఇంకా చాలా మంది చిక్కుకున్నారని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ I నోంగ్‌రాంగ్ తెలిపారు. రెస్క్యూ బృందాలు సెర్చ్ ఆపరేషన్లలో ముమ్మరంగా పనిచేస్తున్నాయని.. ఉదయం థాంగ్స్కు ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని ఆమె తెలిపారు.
►ALSO READ | రాజస్థాన్ హనీమూన్ మర్డర్: యాక్సిడెంట్ అనుకుంటే భార్య ప్లాన్ చేసిన హత్యని తేలింది
ఇప్పటివరకు 16 మృతదేహాలను వెలికితీశామని, పేలుడు సమయంలో గని లోపల ఎంత మంది కార్మికులు ఉన్నారో ఇంకా ఖచ్చితంగా తెలియలేదని.. మరింత మంది చిక్కుకున్నారని చెప్పారు. పేలుడులో గాయపడిన ఒకరిని మొదట సుత్ంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం షిల్లాంగ్ ఆసుపత్రికి తరలించినట్లు తూర్పు జయంతియా హిల్స్ పోలీసు సూపరింటెండెంట్ వికాశ్ కుమార్ తెలిపారు.
