రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో జరిగిన ఘోరం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. రోడ్డు ప్రమాదంగా మొదలైన ఒక కేసు.. పోలీసుల లోతైన విచారణలో భయంకరమైన హనీమూన్ మర్డర్ మిస్టరీగా తేలింది. మూడు నెలల క్రితమే పెళ్లయిన ఆశిష్ అనే యువకుడు, తన భార్య అంజూ పన్నిన కుట్రకు బలైపోయాడు. ఈ ఘటన మేఘాలయలో గతంలో జరిగిన సోనమ్ రఘువంశీ హనీమూన్ మర్డర్ కేసును తలపిస్తోంది.
జనవరి 30 రాత్రి 9 గంటల సమయంలో పోలీసులకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. రోడ్డు మీద ఒక జంట అపస్మారక స్థితిలో పడి ఉన్నారని సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించగా, ఆశిష్ అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. భార్య అంజూ మాత్రం స్పృహ లేకుండా నటించింది. కొద్దిసేపటికి కోలుకున్న ఆమె, తాము వాకింగ్‌కు వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిందని, తన నగలను కూడా ఎవరో దొంగిలించారని ఏడుస్తూ ఓ స్టోరీ అల్లేసింది. పోలీసులు కూడా మెుదట్లో ఇది కొంత వరకూ నిజమే అని భావించారు.
అయితే శ్రీగంగానగర్ ఎస్పీ అమృతా దుహన్ ఈ కేసును సాంకేతిక కోణంలో విచారించడం ప్రారంభించారు. పోస్ట్‌మార్టం రిపోర్టులో ఆశిష్‌ను కేవలం వాహనం ఢీకొట్టడమే కాకుండా, గొంతు నులిమి చంపినట్లు ఆనవాళ్లు బయటపడ్డాయి. చిత్రమైన విషయం ఏంటంటే.. అంత పెద్ద యాక్సిడెంట్‌లో ఆశిష్ చనిపోతే, పక్కనే ఉన్న అంజూకు ఒక్క గీత కూడా పడకపోవడం పోలీసుల అనుమానాన్ని బలపరిచింది. ఆమె స్టేట్‌మెంట్లు మారుస్తూ ఉండటంతో పోలీసులు ఆమె ఫోన్ రికార్డులను పరిశీలించారు.
►ALSO READ | ప్రెగ్నెంట్ చేసినోడు.. DNAలో దొరికిండు.. 17 మందికి టెస్ట్ చేస్తే మూగ ‘తల్లి’ని చేసింది కన్న తండ్రే !
అంజూకు పెళ్లికి ముందే సంజు అనే వ్యక్తితో ప్రేమ వ్యవహారం ఉంది. పెళ్లయిన తర్వాత కూడా ఆమె ప్రియుడితో సంబంధం కొనసాగించింది. ఆశిష్‌ను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసిన అంజూ.. రోజువారీ వాకింగ్‌ను ఒక సాకుగా వాడుకుంది. ఆ రాత్రి కావాలనే తన భర్తను నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లింది. అక్కడ పొదల్లో నక్కి ఉన్న సంజు, అతని స్నేహితులు ఆశిష్‌పై దాడి చేసి గొంతు నులిమి చంపేశారు. దొంగతనం జరిగిందని నమ్మించడానికి తన నగలను, ఫోన్‌ను వారికే ఇచ్చేసి అంజూ రోడ్డుపై పడుకుంది. ప్రస్తుతం పోలీసులు అంజూతో పాటు ఆమె ప్రియుడు సంజు, మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మేఘాలయ హనీమూన్ మర్డర్ తరహాలోనే, తన భర్తను హతమార్చి ప్రమాదంగా చిత్రీకరించాలని చూసిన అంజూ పాపం పండింది. చివరికి పోలీసులకు చిక్కింది.
