ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతోందా ? ఇలా చేస్తే ఫోన్ బ్యాటరీ లైఫ్ కొత్తదానిలా ఉంటుంది..

ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతోందా ? ఇలా చేస్తే ఫోన్ బ్యాటరీ లైఫ్ కొత్తదానిలా ఉంటుంది..

మనలో చాలా మంది రాత్రిపూట  ఫోన్‌ ఛార్జింగ్  పెడుతుంటాము లేదా బయటకు వెళ్లే ముందు ఫుల్  ఛార్జ్ చేస్తుంటాము. కానీ  ఈ  అలవాటు మీ స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీ లైఫ్ ను మెల్లిమెల్లిగా  దెబ్బతీస్తుందని తెలుసా...  చాలా మంది ఫోన్ బ్యాటరీ 0% అయ్యే వరకు వాడి, ఆ తర్వాత 100% వరకు ఛార్జింగ్ పెడుతుంటారు. కానీ, ఇలా చేయడం వల్ల బ్యాటరీ త్వరగా పాడవుతుంది. అందుకే స్మార్ట్‌ఫోన్ బ్యాటరీని జాగ్రత్తగా కాపాడుకోవడానికి కొన్ని ఈజీ టిప్స్ ఉన్నాయి.....

80-20 రూల్ అంటే ఏంటి?
బ్యాటరీపై ఒత్తిడి పడకుండా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్ పాటించండి. ఒకటి ఛార్జింగ్ 80% దాటనివ్వకండి. ఎందుకంటే  బ్యాటరీ 80% దాటిన తర్వాత ఛార్జ్ చేస్తే అది వేడెక్కుతుంది, లోపల ఒత్తిడి పెరుగుతుంది. అలాగే ఛార్జింగ్ 20% కంటే తగ్గనివ్వకండి.  బ్యాటరీ పూర్తిగా 0% అయితే  దాని సామర్థ్యం తగ్గిపోతుంది. మీ ఫోన్ ఛార్జింగ్ 20%కి రాగానే ఛార్జింగ్ పెట్టండి, 80% అవ్వగానే తీసేయండి. ఇదే మీ బ్యాటరీకి అత్యంత సురక్షితమైన పద్ధతి.

 చాలా మందికి రాత్రి పడుకునే ముందు ఫోన్ ఛార్జింగ్ పెట్టి  ఉదయం తీసే అలవాటు ఉంటుంది. ఫోన్ ఛార్జింగ్ 100% అయ్యాక కూడా కరెంట్ తీసుకుంటూనే ఉంటుంది. దీనివల్ల ఫోన్ వేడెక్కి బ్యాటరీ ఉబ్బిపోవడం లేదా షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. ఇప్పుడు వచ్చే ఫోన్లలో బ్యాటరీ 80% అవ్వగానే ఛార్జింగ్ ఆగిపోయే ఫీచర్ ఉంది. ఇందుకు iPhone లో సెట్టింగ్స్‌లో Optimized Battery Charging లేదా Charge Limit ఆప్షన్ ఆన్ చేసుకోండి. Android లో అయితే  సెట్టింగ్స్‌లో Protect Battery లేదా Battery Health లోకి వెళ్లి 80-85% దగ్గర ఛార్జింగ్ ఆగిపోయేలా సెట్ చేసుకోవచ్చు.

బ్యాటరీ వేడెక్కకుండా ఉండాలంటే 
ఛార్జింగ్ అవుతున్నప్పుడు గేములు ఆడటం లేదా వీడియో కాల్స్ చేయ్యొద్దు. దీనివల్ల ఫోన్ విపరీతంగా వేడెక్కుతుంది. మీ ఫోన్‌ను దిండు కింద లేదా దుప్పట్లపై పెట్టి ఛార్జ్ చేయకండి. వీలైతే ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఫోన్ కవర్/పౌచ్  తీసేయండి. అత్యవసరమైతేనే  తప్ప ప్రతిసారి ఫాస్ట్ ఛార్జింగ్ వాడకండి, నిదానంగా ఛార్జ్ అవ్వడమే బ్యాటరీకి మంచిది.

ఫోన్ మార్చడం కంటే ఫోన్ ఛార్జ్ చేసే పద్ధతిని మార్చుకుంటే మీ డబ్బు ఆదా అవుతుంది, ఫోన్ కూడా కొత్తదానిలా పనిచేస్తుంది.  80–20 రూల్ పాటించడం వల్ల మీ బ్యాటరీ ఎక్కువసేపు  వస్తుంది.. వేడెక్కకుండా  కూల్ గా ఉంటుంది.