హైదరాబాద్, వెలుగు: కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 150 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్రలో గిగ్ కార్మికులకు ఇచ్చిన హామీని ప్రజా ప్రభుత్వం నిలబెట్టుకుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘గిగ్ వర్కర్స్ గుఫ్తగూ’ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. పాదయాత్ర సమయంలో హైదరాబాద్ వచ్చిన రాహుల్ గాంధీకి గిగ్ కార్మికులు తమ సమస్యలు వివరించారని గుర్తుచేశారు.
నిత్యావసరాలు, ఆహార పదార్థాలు, కొరియర్లు అందిస్తున్నా, ఇళ్లలో పనిచేస్తున్నా తమకు చట్టపరమైన గుర్తింపు, రక్షణ లేదని, శ్రమకు తగిన ఆదాయం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రత్యేక చట్టం తెచ్చి హక్కులు, ఆదాయానికి రక్షణ కల్పిస్తామని రాహుల్ ఇచ్చిన హామీని ఇప్పుడు నెరవేర్చామన్నారు.
మాట ఇస్తే ప్రాణం పోయినా నిలబెట్టుకునే గాంధీ కుటుంబ వారసత్వ స్ఫూర్తితో ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చామని చెప్పారు. దేశం కోసం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణత్యాగం చేయగా, సోనియా గాంధీ పదవిని త్యాగం చేశారని గుర్తుచేశారు. నెహ్రూ జయంతి సందర్భంగా ఈ చట్టాన్ని కార్మికులకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు.
నిస్వార్థంగా సహకరించిన నిఖిల్ డే
గిగ్ కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల ఉచిత వైద్య భద్రత కల్పిస్తున్నామని సీఎం ప్రకటించారు. ఒక్క గంట పనిచేసినా కార్మికుడి కష్టార్జితం పూర్తిగా దక్కాలన్న లక్ష్యంతో ప్రత్యేక గిగ్ వర్కర్స్ బోర్డు ఏర్పాటు చేసి, ప్రతి ఒక్కరికీ గుర్తింపు సంఖ్య, కార్డులు అందజేస్తామన్నారు. ఈ చట్టం రూపకల్పనలో ఎలాంటి ఆర్థిక ప్రయోజనం ఆశించకుండా సహకరించిన సామాజికవేత్త నిఖిల్ డే సేవలను అభినందించారు.
నాలుగు గోడల మధ్య కూర్చొని చట్టాన్ని రూపొందించలేదని, ఐఐటీ, ట్రిపుల్ ఐటీ బెంగళూరు నిపుణులు, సుపరిపాలన సలహాదారులతో పాటు క్షేత్రస్థాయి కార్మికులు, సంఘాల నాయకుల అభిప్రాయాలు తీసుకున్నామని వివరించారు. గిగ్ కార్మికులకు సంపూర్ణ రక్షణ కల్పించడంతో పాటు భవిష్యత్తులోనూ వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
