తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌‌‌‌చార్జిగా  బీఎం సందీప్ 

తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌‌‌‌చార్జిగా  బీఎం సందీప్ 
  • మీనాక్షి నటరాజన్ స్థానంలో నియామకం
  • ఉత్తర్వులు జారీ చేసిన కేసీ వేణుగోపాల్
  • యూత్ కాంగ్రెస్ నుంచి అంచెలంచెలుగా ఎదిగిన నేత
  • పార్టీ మరింత బలోపేతం అవుతుంది: మహేశ్ గౌడ్

 
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌‌‌‌చార్జిగా బీఎం సందీప్‌‌‌‌ను పార్టీ హైకమాండ్ నియమించింది. మీనాక్షి నటరాజన్ స్థానంలో ఆయనను నియమిస్తూ శనివారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. కర్నాటకలోని చిక్కమగళూరుకు చెందిన సందీప్, కాంగ్రెస్ సంస్థాగత విభాగం నుంచి అంచెలంచెలుగా ఎదిగారు.

గతంలో యూత్ కాంగ్రెస్‌‌‌‌లో, రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ జాతీయ కన్వీనర్‌‌‌‌గా పనిచేశారు. ప్రస్తుతం ఏఐసీసీ కార్యదర్శిగా మహారాష్ట్ర వ్యవహారాలు చూస్తున్న ఆయన, కేరళ అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. సందీప్ నియామకంపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఆయన నియామకంతో రాష్ట్రంలో కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుందన్నారు. ఇప్పటిదాకా ఇన్‌‌‌‌చార్జిగా పనిచేసిన మీనాక్షి నటరాజన్‌‌‌‌కు కృతజ్ఞతలు తెలిపారు.