దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా భారత్ సమిట్.. రాహుల్ కు తెలంగాణలో అడుగుపెట్టే హక్కు లేదు : రాంచందర్ రావు

దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా  భారత్ సమిట్.. రాహుల్ కు తెలంగాణలో అడుగుపెట్టే హక్కు లేదు : రాంచందర్ రావు
  •     బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​ రావు ఫైర్ 

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌లో కాంగ్రెస్ నిర్వహిస్తున్న భారత్ సమిట్ రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే సదస్సు కాదని, దేశ ప్రతిష్టను దెబ్బతీసే యాంటీ- భారత్ సమిట్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మండిపడ్డారు. ఈ సదస్సుకు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటనకు వ్యతిరేకంగా శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో శనివారం ఉదయం తన నివాసంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలను పోలీసులు అక్రమంగా హౌస్ అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

విదేశీ శక్తులతో కలిసి ‘రెజీమ్ చేంజ్’ కుట్ర

విదేశీ శక్తులతో కలిసి దేశంలో ‘రెజీమ్ చేంజ్’ కుట్ర పన్నుతున్న ప్రోగ్రెసివ్ అలయన్స్‌‌‌‌తో రాహుల్ భేటీ కావడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని రాంచందర్ రావు స్పష్టం చేశారు. భారత్‌ అంతర్గత రాజకీయాలపై విదేశీయులతో చర్చించేందుకు, ప్రధాని మోదీ ప్రభుత్వంపై ప్రపంచానికి తప్పుడు సమాచారం ఇచ్చేందుకే ఈ సదస్సు  నిర్వహిస్తున్నారని దుయ్యబట్టారు. భారత్, మోదీకి వ్యతిరేకంగా వ్యాసాలు రాసిన నార్వే జర్నలిస్టు హెల్లె లింగ్ వీసాను 10 నిమిషాల ముందు రద్దు చేశారంటూ ఆమె ట్వీట్ చేయడాన్ని ప్రస్తావిస్తూ.. దేశ వ్యతిరేక రాతలు రాసే వారిని ఎందుకు ఆహ్వానించారని ప్రశ్నించారు. గతంలో విదేశాల్లో భారత ఆర్థిక వ్యవస్థను అవమానించిన రాహుల్.. ఇప్పుడు విదేశీయులను మన గడ్డపైకి తెచ్చి దేశంపై విషం చిమ్మిస్తున్నారని ఆరోపించారు. 

ఆరు గ్యారెంటీలు, జాబ్​ క్యాలెండర్, రైతు భరోసా ఎక్కడ?

అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, జాబ్ క్యాలెండర్, రైతుభరోసా వంటి హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నిలువునా మోసం చేసిందని విమర్శించారు. ఏ రంగంలోనూ హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయని రాహుల్ గాంధీకి తెలంగాణ గడ్డపై అడుగుపెట్టే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. అక్రమ హౌస్ అరెస్టులతో బీజేపీని ఆపలేరని, ప్రభుత్వ నిర్బంధాలకు భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.